ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగుదేశంలో సంకుల సమరం

Andhra Pradesh Telugu |   | Published : Thu, Feb 23, 2017, 02:38 PM

కాకినాడ : జిల్లాలో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం టీడీపీలో సంకుల సమరానికి తెరలేచింది. నామినేషన్ల గడువు దగ్గర పడేకొద్దీ పార్టీలో ఆశావహుల మధ్య పోరు తీవ్రమవుతోంది. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీ సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మెజార్టీ టీడీపీకి ఉన్న నేపథ్యంలో గెలుపు సునాయాసమనే విశ్వాసంతో రేసులో ఉన్న వారి సంఖ్య చాంతాడును తలపిస్తోంది.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పదవీ కాలం మే ఒకటో తేదీతో ముగియనుండటంతో ఆ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. సిటింగ్‌ ఎమ్మెల్సీ భాస్కర రామారావు రెండోసారి బరిలో నిలుస్తున్నట్టు ఆయన అనుచరగణం ఇప్పటికే విస్తృతమైన ప్రచారం చేస్తోంది. మంగళవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతో మాట్లాడేందుకు వెళ్లడం అందులో భాగమేనంటున్నారు. విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగానే ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడం తెలిసిందే. రెండోసారి బరిలో నిలిచేందుకు భాస్క ర రామారావు ప్రయత్నాలపై ప్రత్యర్థి వర్గం నీళ్లు చల్లేం దుకు పావులుకదుపుతోంది. పార్టీని కాదని విడిచి వెళ్లిపోయి తిరిగొచ్చిన వారికి రెండోసారి అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. సిటింగ్‌ ఎమ్మెల్సీకి రాజకీయంగా బద్ధవిరోధి అయిన ప్రత్యర్థి వర్గానికి చెందిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తండ్రి మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి వంటి నేతలు భాస్కర రామారావు వ్యతిరేకులందరినీ ఏకం చేస్తున్నారని  పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకు వ్యూహాత్మకంగానే కేబినెట్‌ విస్తరణలో అవకాశం లభిస్తుదంటున్న చంద్రబాబు తనయుడు లోకేష్‌ను ప్రతిపాదించారు. ఇక్కడ పార్టీకి మెజార్టీ ఓటింగ్‌ ఉండటాన్ని చూపించగా మొదట్లో బాబు కూడా సానుకూలత ప్రదర్శించారు. ఇంతలో ఎమ్మెల్యే, గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలు ఉండటంతో ఇక్కడ నుంచి పోటీ చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంతోనే భాస్కర రామారావుకు తిరిగి అవకాశం కల్పించే విషయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గ్రీ¯ŒS సిగ్నల్‌ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.


కాపుల వైపు చూపు...రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కాపు ఉద్యమంలో జిల్లా నుంచి ముద్రగడ పద్మనాభం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న క్రమంలో ఈసారి ఆ సామాజిక వర్గానికి కేటాయించాలనే ప్రతిపాదన వచ్చింది. పార్టీలో సీనియర్‌ అయిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు లేదా, కోనసీమ కేంద్రం అమలాపురం నుంచి దివంగత మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు తనయుడు మెట్ల రమణబాబు పేర్లు ప్రముఖంగా ఆ సామాజికవర్గ నేతలు బాబు వద్ద పరిశీలనలోకి తీసుకువెళ్లారు. ఈ రెండు పేర్లు పరిగణనలోకి తీసుకోవాలని ఆ సామాజికవర్గానికి చెందిన ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధినేత దృష్టికి తీసుకువెళ్లారంటున్నారు. వీరితో పాటు 24 ఏళ్లుగా పార్టీలో ఎటువంటి పదవులు ఆశించలేదంటూ తాళ్లరేవు మండలం మల్లవరానికి చెందిన దూళిపూడి బాబి యువత కోటాలో పరిగణనలోకి తీసుకోవాలని సీనియర్లను అభ్యర్థిస్తున్నారు.


 


అయోమయంలో చిన రాజప్ప


రమణబాబు, చిక్కాల విషయంలో మొదట సానుకూలత వ్యక్తం చేసిన చినరాజప్ప తాజా రాజకీయ సమీకరణల్లో భాస్కర రామారావు వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం. ప్రధానంగా రెండు కారణాలను ఇందుకు నేతలు విశ్లేషిస్తున్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆర్థిక మంత్రి యనమల చాలాకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. అటువంటి యనమలకు విరోధి అయిన ఎంపీ తోట ప్రతిపాదిస్తున్న అతని బావమరిది రమణబాబుకు సానుకూలంగా ఉంటే, భాస్కర రామారావుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన యనమలతో దూరం ఏర్పడుతుందని చినరాజప్ప మనసు మార్చుకున్నారంటున్నారు.రెండోది తన రాజకీయ భవిష్యత్తు ఒకప్పుడు పెద్దాపురం బొడ్డు భాస్కర రామారావుకు పెట్టనికోట. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్ప 2019 ఎన్నికల్లో తిరిగి అక్కడి నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తే వచ్చే ఎన్నికల్లో పెద్దాపురంలో ‘బొడ్డు’ అడ్డు ఉండదనే ముందుచూపుతోనే చినరాజప్ప ప్లేటు ఫిరాయించారంటున్నారు. ఇది చినరాజప్ప రాజకీయ భవిష్యత్తుకు ఎంతవరకు ఉపకరిస్తుందో ఇప్పుడే అంచనాకు రావడం పొరపాటే అవుతుంది. కానీ జిల్లాలో పోలీసుల సాయంతో కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపిన చినరాజప్పపై ఆ సామాజికవర్గం ఇప్పటికే ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇప్పుడు తమ సామాజిక వర్గానికి వచ్చే అవకాశాన్ని కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం పణంగా పెడుతున్నారని టీడీపీలోని కాపు వర్గీయులు కూడా రాజప్పపై మండిపడుతున్నారు.
పావులు కదుపుతున్న గన్ని...
పార్టీలో సీనియర్‌ అయిన తనకు అవకాశం ఇవ్వాలని గన్ని కృష్ణ పట్టుబడుతున్నారు. రాజమహేంద్రవరంలో అనుచరులతో సమావేశమై రేసులో ఉన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్, సిటీ కోసం ప్రయత్నించిన సందర్భంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కృష్ణ పట్టుబడుతూ తాడోపేడో తేల్చుకుంటారని గన్ని వర్గం పేర్కొంటోంది. గన్ని ఆశలపై రాజకీయ ప్రత్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గండికొట్టే దిశగా పావులుకదుపుతున్నారని అనుమానపడుతున్నారు.‘గుడా’ చైర్మన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న కృష్ణ ఎమ్మెల్సీ రేసులో కూడా ఉంటారా అని గోరంట్ల వర్గం ప్రశ్నిస్తోంది.
ఇంకా మరి కొందరు...
బ్రాహ్మణ కోటాలో డొక్కా నా«థ్‌బాబు, మత్స్యకార కోటాలో కాట్రేనికోన జెడ్పీటీసీ నాగిడి నాగేశ్వరరావు కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ నేతలను వెంటబెట్టుకుని సీఎంను కలిసేందుకు నాగేశ్వరరావు వెళుతున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు  సీఎం అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరకు బొడ్డు, చిక్కాలలో ఒకరికి ఖాయమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బరిలో నిలిచే అభ్యర్థి ఎవరనేది పార్టీ అధినేత ఈ నెల 25న తేలుస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com