కర్నూలు జిల్లాలో ఈనెల 16వ తేదీ నుంచి పిల్లలకు సైతం కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వై. ప్రవీణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నేషనల్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారన్నారు.
ఇందులో భాగంగా చిన్నారులకు కార్బివ్యాక్స్ అనే కోవిడ్ వ్యాక్సిన్ ను వేయనున్నట్లు చెప్పారు. 2008 మార్చి నుంచి 2010 మార్చి మధ్యలో జన్మించిన పిల్లలకు, ప్రస్తుతం 7, 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాల్లో వ్యాక్సిన్ వేస్తామన్నారు.
ఇందు కోసం ఇప్పటికే జిల్లాలో 1. 50 లక్షల డోసుల వ్యాక్సిన్ సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ 0. 5ఎంఎల్ డోసు మాత్రమే వేయాలన్నారు. నేషనల్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు ఆశాలు, ఒక ఏఎన్ఎంలను ఎంపిక చేసి వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపిక అందజేస్తామని తెలిపారు.
![]() |
![]() |