రష్యా-ఉక్రెయిన్ సాకుతో ధరలు పడిపోయి పసుపు రైతులు దిగాలు చెందుతున్నారు. గత నెలలో పసుపు క్వింటం రూ. 7 వేలకు పైగా పలికింది. ఇప్పుడిప్పుడే పంట మార్కెట్‌కు చేరుతోంది. అధిక వర్షాలకు పంట నాణ్యత లేకపోవడం, దిగుబడి గణనీయంగా తగ్గింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ లేక పోవడం కూడా ధర పతనానికి మరో కారణమని వ్యాపారులు అంటున్నారు. దీన్ని సాకు చేసు కొని ధరలు బాగా తగ్గించేశారు. దీని వల్ల ప్రస్తుతం పసుపు ధర రూ. 6 వేలు లోపు మాత్రమే పలుకుతోంది.
గత నాలుగేళ్ల నుంచి పసుపు ధర పెరగక పోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలవుతున్నారు. ఈ ఏడాది చాగలమర్రి మండలంలో 800 ఎకరాల దాకా పసుపు పంటను సాగు చేశారు. ఒక్క చిన్నవంగలి గ్రామంలోనే 500 ఎకరాల దాకా పసుపు పంటను సాగు చేశారు.
ఎకరాకు రూ. లక్ష ఖర్చు పెట్టారు. సాధారణంగా దిగుబడి 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. అయితే 10 నుంచి 15 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. వచ్చిన పసుపును అమ్ముకునేందుకు ధర లేకపోవడంతో కొందరు రైతులు పసుపును కడపకు తరలించి ఏసీ గోదాముల్లో ఉంచుతున్నారు.
![]() |
![]() |