అది అత్యంత పటిష్ట భద్రత ఉన్న జైలు. అందులోనూ ఇటీవలే దానిని నూతనంగా నిర్మించారు. అక్కడి నుంచి పారిపోవాలనే ఆలోచనే లేకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. భారీ ఎత్తున ఉండే గోడలు, వాటిపైన ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉన్నాయి. ఏ మాత్రం గోడెక్కినా, షాక్ కొడితే ప్రాణాలు పోతాయి. తప్పించుకుని కింద పడినా ఎముకలన్నీ విరిగిపోతాయి. ఇలాంటి జైలు నుంచి ఓ ఖైదీ హటాత్తుగా మాయమయ్యాడు. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. తిరిగి 24 గంటల తర్వాత జైలులోని తన గదిలో ప్రత్యక్షమయ్యాడు. తల పట్టుకోవడం అధికారుల వంతు అయింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని కర్నూలు జిల్లా జైలును భారీ వ్యయంతో అత్యంత అధునాతనంగా ఇటీవలే నిర్మించారు. ఇక్కడి నుంచి ఖైదీలు పారిపోవడానికి అవకాశమే లేకుండా ఏర్పాట్లు చేశారు. అందనంత ఎత్తులో భారీ కాంపౌండ్ వాల్స్ నిర్మించారు. వాటిపై ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా వాటిని ముట్టుకుంటే షాక్ కొట్టి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. ఒక వేళ అక్కడి నుంచి దూకినా ఎముకలన్నీ నుజ్జునుజ్జవుతాయి. ఈ క్రమంలో ఓ హత్య కేసులో కుల్లాయి అలియాస్ నాని గత నెలలో జైలుకు వచ్చాడు. హఠాత్తుగా శనివారం మాయమవడంతో అధికారులంతా ఆందోళన చెందారు. మొత్తం జైలు ప్రాంగణమంతా గాలించినా జాడ కనపడలేదు. వారి కళ్లుగప్పి బయటకు పారిపోయాడు. ఇది జరిగిన 24 గంటల తర్వాత తాపీగా అతడు జైలుకు తిరిగి వచ్చేశాడు. దీంతో జైలు అధికారులు అవాక్కయ్యారు. పోలీసుల పహారా, పటిష్ట భద్రత మధ్య ఎలా తప్పించుకున్నాడో తెలియక అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. ఈ ఘటనపై జైళ్ల శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. జైలు అధికారులు ఈ విషయంలో సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక నాని ఎలా తప్పించుకున్నాడో అధికారులు ఆరా తీస్తున్నారు.
![]() |
![]() |