అది మంచి పరిణామం కాదు: మిథాలీ

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 06:47 PM
 

న్యూఢిల్లీ: గువాహటిలో జరిగిన రెండో టీ 20 తరువాత ఆస్ట్రేలియా క్రికెటర్లు హోటల్ కు వెళ్లే సమయంలో వారి బస్సుపై రాయితో దాడి జరగడాన్ని భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ తీవ్రంగా ఖండించారు. రాయితో దాడి చేయడం ఎంతమాత్రం మంచి పరిణామం కాదని ఆమె పేర్కొన్నారు. క్రికెట్ అనేది ఒక గేమ్ అని, దానిని ఆ కోణంలోనే చూడాలే తప్ప దాడులకు దిగడం సరైనది కాదన్నారు. ఈ తరహా దాడులకు పాల్పడిన సదరు వ్యక్తులు కఠినమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మిథాలీ హెచ్చరించారు. అంతకుముందు ఈ ఘటనను అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ ఖండించిన సంగతి తెలిసిందే. బాధ్యులపై గట్టి చర్యలు తీసుకుంటామని సోనోవాల్‌ చెప్పగా...ఆతిథ్య జట్టుకు మెరుగైన భద్రత కల్పించడం తమకు అన్నింటికంటే ముఖ్యమని రాథోడ్‌ అన్నారు. మరోవైపు స్పిన్నర్‌ అశ్విన్‌ కూడా ఈ ఘటనను తప్పు పట్టాడు. ‘ఆసీస్‌ జట్టుపై విసిరిన రాయి మనకు చెడ్డ పేరు తెచ్చింది. మనలో ఎక్కువ మందికి బాధ్యతతో మెలగడం తెలుసు కాబట్టి అలాగే ఉందాం’ అని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు.