157 గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 05:02 PM
 

విజయవాడ: రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఇందులో భాగంగా తొలిదశలో 157 నియోజవర్గాల పరిధిలో 157 మేజర్‌ పంచాయతీలను ఎంపిక చేసి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు సంకల్పించినట్లు చెప్పారు. గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుపై విజయవాడలో జరిగిన అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, ఎమ్మెల్యేలు, 157 గ్రామాలకు చెందిన సర్పంచులు, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ రామాంజనేయులు తదితరులు హాజరయ్యారు. ఇప్పటికీ దేశంలోని చాలా నగరాలు, పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదని.. అలాంటిది మన రాష్ట్రంలో గ్రామస్థాయిలో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని లోకేశ్‌ అన్నారు. 157 గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన సహకారం గ్రామస్థుల నుంచి అందేలా సంబంధిత సర్పంచులు చొరవ తీసుకోవాలని సూచించారు. దీనికోసం రూ.500కోట్లకు పైగా నిధులు కేటాయించామన్నారు.