ఆరుషి హత్యకేసులో తల్లిదండ్రులకు ఊరట

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 03:49 PM
 

అలహాబాద్: ఆరుషి హత్యకేసులో ఆమె తల్లిదండ్రులకు ఊరట లభించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అలహాబాద్ హైకోర్టు వీరిని నిర్దోషులుగా పేర్కొంది. అలహాబాద్ న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరిస్తూ కేసుకు సంబంధించి ఆధారాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైందని పేర్కొంది. ఆరుషిని తల్లిదండ్రులే చంపినట్లుగా ఆధారాలు లేవని తెలిపింది. అనుమానాల ఆధారంగా శిక్షలు విధించలేమని వెల్లడించింది. నోయిడాలో 16మే, 2008లో ఆరుషి తల్వార్(14) తన బెడ్‌రూంలో హత్యకు గురైంది. గొంతుకోయడం ద్వారా ఆమె చనిపోయింది. హత్యకు గల కారణంగా పనిమనిషి హేమ్‌రాజ్(45)ను ప్రధాన నిందితుడిగా మొదట అనుమానించారు. కాగా ఆరుషి హత్య జరిగిన మరుసటి రోజే అనుమానాస్పద రీతిలో హేమ్‌రాజ్ సైతం తల్వార్ అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై చనిపోయి పడిఉన్నాడు. దీంతో పోలీసులు ఆరుషి తల్లిదండ్రులను అనుమానించారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉండటం చూసి తల్లిదండ్రులే ఆరుషిని, హేమ్‌రాజ్‌ను హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వారం రోజుల తర్వాత తండ్రి రాజేశ్ తల్వార్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తల్లిదండ్రులే హత్యచేసినట్లుగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. కేసు వివాదస్పదం కావడంతో అప్పటి యూపీ సీఎం మయావతి కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ సైతం కేసు విచారణకు రెండు బృందాలను నియమించింది. అయినప్పటికీ ఫోరెన్సిక్ నివేదికలుగానీ, ఇతర ఏ ఆధారాలుగానీ తల్లిదండ్రులే ఆరుషిని చంపినట్లుగా తేలలేదు. దీంతో ఆధారాలు సమర్పించని కారణంగా అనుమానం కింద శిక్షలు విధించలేమని న్యాయస్థానం పేర్కొంది.