జీఎస్టీ పరిధిలోకి రియల్ ఎస్టేట్‌ను తెస్తాం : అరుణ్ జైట్లీ

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 02:32 PM
 

రియల్ ఎస్టేట్‌ను కూడా జీఎస్టీ కిందకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. హార్వర్డ్ యూనివర్సిటీలో మాట్లాడారు. భారత్ చేపట్టిన పన్ను సంస్కరణలపై ఆయన తన అభిప్రాయాలను వినిపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో భారీ స్థాయిలో పన్ను ఎగవేత జరుగుతున్నదని.. త్వరలోనే ఆ రంగాన్ని కూడా జీఎస్టీ కిందకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. జీఎస్టీ మండలి నిర్వహించే తదుపరి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటామన్నారు. గువాహతిలో నవంబర్ 9వ తేదీన తదుపరి జీఎస్టీ సమావేశాలు జరగనున్నాయి. నగదు మార్పిడి ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్నదని, అక్కడే ఎక్కువ శాతం పన్ను కూడా ఎగవేస్తున్నారని, రియల్ ఎస్టేట్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కొన్ని రాష్ర్టాలు డిమాండ్ చేస్తున్నాయని, రియల్‌ను జీఎస్టీ కిందకు తీసుకురావాలని తాను కూడా గట్టిగా విశ్వసిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. వచ్చే నెలలో జరిగే జీఎస్టీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు.. రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయని, అందుకే దానిపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం బిల్డింగ్ నిర్మాణాలపై 12 శాతం జీఎస్టీ వసూల్ చేస్తున్నారు. అయితే భూమి, స్థిరాస్తులపై మాత్రం జీఎస్టీ లేదు. నోట్లు రద్దు అనేది ప్రాథమిక సంస్కరణ అని, దేశాన్ని పన్ను ఎగవేత నుంచి ఆదుకునేందుకు తీసుకున్న చర్య అని జైట్లీ తెలిపారు.