ఒంగోలు జిల్లాల్లో నిషేధిక గుట్కా వ్యాపారం పై పోలీసులు శీతకన్ను వేశారు. గతంతో పోలిస్తే గుట్కాపై దాడులు తగ్గాయి. స్టేషనళ్లు కొత్తగా వచ్చిన సమయంలో త్రి, టు స్టార్ల హడావుడి చేయడం తప్ప.. ఆ తర్వాత ఆ ఊసే పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడపాదడపా దాడులు తప్ప.. నిర్దిష్టమైన నిఘాతో దాడులు చేయడం లేదు. దీంతో గుట్కా వ్యాపారులుకూడా దర్జాగానే తమ వ్యాపారాన్ని సాగించేస్తున్నారు.
ఒంగోలు నగర శివారు ప్రాంతాలు కేంద్రంగా గుట్టుగా సాగుతున్న గుట్కా వ్యాపారంపై పోలీసులు దృష్టి సారించడం లేదు. జిల్లాల్లో విచ్చలవిడిగా గుట్కా రవాణా సాగుతోంది. పోలీసులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు దాడులు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతం కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో గుట్కా బస్తాలు జిల్లాల్లోని ఆయా ప్రాంతాలకు చేరి.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్లు సమాచారం. గతంలో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు లేనందునే..వారు మరింతగా బరితెగించి గుట్కా దందా సాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గుట్కా సంచులు తెప్పించి..జిల్లాల్లోని ఆయా ప్రాంతాలకు తరలించేవారు. పట్టణ శివారు ప్రాంతాల్లో సరుకు నిల్వ చేసి గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ఆ తరువాత అక్రమార్కులు తమ పంథాను మార్చారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, బళార్లి ప్రాంతాల నుంచి సరఫరా జరుగుతోంది. కొందరు విమల్ డిస్ట్రిబ్యూటర్ల ముసుగులో నిషేధిత జర్దా పాన్‌మసాలా తెప్పిస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ద్విచక్రవాహనాలు, కూరగాయలఆటోలు, పార్శిల్ వాహనల ద్వారా ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు.
జిల్లా సరిహద్దు జిల్లాలుగా ఉన్న నెల్లూరు, కడప, గుంటూరులోని రిటైల్ వ్యాపారులకు కూడా ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
వ్యాపారాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు
నిషేధిత గుట్కా వ్యాపారాన్ని కొంతమంది మరింత సీరియస్ గా తీసుకొని ప్రతి నెలా లక్షలాది రూపాయలను గడిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేస్తే వారం తిరక్కుండానే వచ్చేస్తామనే ధీమాతో తమ దందాను కొనసాగిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని గతంలో ఎవరైతే నిర్వహించేవారో ఇప్పటికీ వారే నడుపుతున్నారు. పోలి చైన్ సిస్టంలో ఈ గుట్కా దందా నడుస్తోంది. జిల్లాలో రూ.3 కోట్లకు పైగానే వ్యాపారం. జిల్లాల్లో నిషేధిక గుట్కా వ్యాపారం నెలకు రూ. 3 కోట్లకు పైనే ఉంటుంది. గుట్కా నమిలేవారి అభిరుచి ఆధారంగా సుమారు 10 పేర్లతో సాధారణ గుట్కా, పాన్ మసాలా గుట్కా (రెండు ప్యాకెట్లను కలిపి తింటారు)తయారు చేస్తారు.
అంతే కాదు విమల్ పాన్ మసాలా వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఒక్కో బోరెంలో రూ.26వేలు పడుతోంది. అందులో 208 ప్యాకెట్ల వరకు ఉంటాయి. వాటి మాటున నిషేధిక గుట్కా వ్యాపారం సాగుతోంది. అంతే కాకుండా 12 గుట్కా ప్యాకెట్ల విలువ గతంలో రూ.50 ఉండేది. కర్ప్యూ తరువాత దీన్నే రూ.400 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. గుట్కా అలవాటు పడినవారు...ఎంత
ధరైనా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత వీటికి అలవాటు పడుతుండటంతోనే గుట్కా వ్యాపారం ఇంత పెద్ద ఎత్తున సాగడానికి కారణం. ఇప్పటికైనా పోలీసులు ఆ దిశగా దృష్టిసారించి గుట్కామాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
చిరు వ్యాపారులపైనే చర్యలు..!
గుట్కా అక్రమ వ్యాపారం పై సంబంధిత అధికారులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు జరుపుతున్న దాడుల్లో చిరు వ్యాపారులు మాత్రమే పటుబడుతున్నారు. బడా వ్యాపారులు చిక్కడం లేదనే ఆరోపణలున్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా పెద్ద మోతాదులో గుట్కాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నప్పటికీ గుట్కా వ్యాపారులు తమ పద్దతులను మార్చుకోవడం లేదు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి తాఖీదులు, హుకుం జారీ చేస్తే నామ్ కే వాస్తేగా షాపుల్లో తనిఖీలు నిర్వహించి గుట్కాలు, అంబార్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వ్యాపారులను వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa