బీజేపీకి వ్యతిరేకంగా తలపెట్టిన లాలూ ర్యాలీలో శరద్‌యాదవ్‌, అఖిలేశ్‌

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 27, 2017, 05:26 PM
 

2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తలపెట్టిన భారీ ర్యాలీకి జేడీయూ తిరుగుబాటు నేత శరద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. పాట్నాలోని గాంధీ మైదానం ఈ ర్యాలీకి వేదిక అయింది.   ఈ వేదికపై లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి, శరద్ యాదవ్, ఎంపీ అలీ అన్వర్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తదితరులు ఆసీనులయ్యారు. ప్రధాని నరేంద్రమోదీని వ్యతిరేకిస్తున్న వాళ్లందరూ కోర్టు కేసులతో బాధపడుతున్నారని ఈ సందర్భంగా లాలూ విమర్శించారు. కాగా, వర్షాల కారణంగా వరదల బారిన పడి, బీహార్ సతమతమవుతున్న పరిస్థితుల్లో ఈ ర్యాలీలు అవసరమా? అంటూ జేడీయూ మండిపడుతోంది.