మంత్రి బంధువుకు ట్రైన్‌లో చేదు అనుభవం

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 13, 2017, 04:39 PM
 

తిరుపతి: ఏపీ మంత్రి శిద్దా రాఘవరావు బంధువుకు ట్రైన్‌లో చేదు అనుభవం ఎదురైంది. దుండిగల్‌కు చెందిన షర్మిల(45) అనే మహిళ మంత్రి శిద్దా రాఘవరావుకు బంధువు. శిద్దా రాఘవరావు షష్టిపూర్తి వేడుకలకు హాజరైన ఆమె శబరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు తిరుగు పయనమైంది. టూ టైర్ ఏసీ కోచ్‌లో ఆమె ప్రయాణిస్తోంది. ఆ కోచ్‌లో కొందరు దోపిడి దొంగలు ప్రయాణికులుగా నమ్మించి వెళుతున్నారు. అందరూ ఆదమరిచిన నిద్రిస్తున్న క్రమంలో నలుగురు ప్రయాణికులకు సంబంధించిన 62 సవర్ల బంగారు ఆభరణాలను, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను దొంగిలించి, పరారయ్యారు.  ఈ ఘటనలో మంత్రి బంధువు షర్మిలకు చెందిన 40 సవర్ల బంగారం కూడా దోపిడికి గురైంది. ఈ ఘటన తిరుపతి, రేణిగుంట మధ్యలో జరగడంతో చెన్నై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఏపీ పోలీసులకు కేసును బదిలీ చేశారు. పోలీసులు రైల్వే స్టేషన్లలో రికార్డయిన సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అనుమానితులుగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.