రాందేవ్ బాబా గ‌డ్డాన్ని పట్టుకున్న దలైలామా

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 13, 2017, 04:16 PM
 

ఈ రోజు ముంబైలో ప్రపంచ శాంతి, సామరస్య సమ్మేళన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బౌద్ధగురువు దలైలామా, భార‌త‌ యోగా గురువు రాందేవ్ బాబా హాజ‌రై ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఆసక్తికరమైన సన్నివేశం సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇందులో రాందేవ్ బాబా గ‌డ్డాన్ని ద‌లైలామా ప‌ట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన పొట్టపై సరదాగా తట్టడంతో.. రాందేవ్ తన పొట్టపై వున్న ఆచ్చాదనను తొలగించి చూపించి, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడిన తన మార్కు యోగా ఫీట్ ను చేసి చూపించారు.  కాగా, ఈ స‌మ్మేళ‌నంలో రాందేవ్ బాబా మాట్లాడుతూ చైనాపై మండిప‌డ్డారు. ఆ దేశానికి శాంతి, సామరస్యం అంటే ఏమిటో తెలియదని అన్నారు. చైనాకు ఆ విష‌యం తెలిసి ఉంటే దలైలామా భార‌త్‌లో ఆశ్రయం పొందాల్సిన అవసరమే వచ్చేదికాదని తెలిపారు. అందుకే ఆ దేశంతో ‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ’ అన్న చందంగానే వ్య‌వహరించాలని, శాంతియుతంగా చెబితే అర్థం చేసుకోలేనివాళ్లకు యుద్ధంతోనే సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు.ఈ కార్య‌క్ర‌మంలో దలైలామా మాట్లాడుతూ... ప్రపంచంలో అశాంతికి హింసావాదమేనని కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. భయం విసుగును పుట్టిస్తుందని, దాని వ‌ల్ల‌ కోపం పుడుతుంద‌ని,  కోపం మనిషిని హింసవైపునకు నడిపిస్తుందని ఆయ‌న తెలిపారు. అందుకే ప్రజలంద‌రూ భయం లేకుండా జీవించాలని అన్నారు.