పిల్ల‌ల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ఎవ్వ‌రినీ వ‌దిలేది లేదు: యోగి

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 13, 2017, 03:31 PM
 

గోర‌ఖ్ పూర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా బాబా రాఘవ్‌దాస్ (బీఆర్‌డీ) ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో ఆక్సిజన్ అందకపోవడం 63 మంది పసికందులు మరణించిన ఐదు రోజుల తర్వాత ఇవాళ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ న‌డ్డాతో క‌లిసి యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ద‌వాఖాను ను సంద‌ర్శించారు. ఆక్సిజ‌న్ అంద‌క పిల్ల‌లు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న పై ఆరా తీశారు. ప్ర‌ధాని మోదీ కూడా ఈ ఘ‌ట‌న పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశార‌ని యోగి పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న‌.. ఈ ఘ‌ట‌న పై ద‌ర్యాప్తు చేయ‌డానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశామ‌ని... నివేదిక‌ వ‌చ్చాక‌.. పిల్ల‌ల మ‌ర‌ణాలకు కార‌ణ‌మైన వారిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌దిలేది లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇంత నిర్ల‌క్ష్యం గా వ్య‌వ‌హ‌రించిన వారిని స‌హించేది లేద‌న్నారు. కొంత‌మంది కావాల‌ని సున్నిత‌మైన అంశాల‌ను లేవ‌దీసి పుండుపై ఉప్పు చ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తూ త‌మ‌ సెన్సివిటీ ని చంపేసుకున్నార‌ని విమ‌ర్శించారు. పిల్ల‌ల మ‌ర‌ణాలు త‌న‌ను ఎంతో క‌లిచివేశాయ‌ని యూపీ సీఎం ఉద్వేగానికి లోన‌య్యారు.


 


అయితే... ఆక్సిజన్ అందకపోవడం వల్ల పిల్ల‌లు చ‌నిపోలేద‌ని ప్రభుత్వం బుకాయిస్తున్నప్పటికీ, గత పక్షం రోజులుగా దవాఖానలోని ఎమర్జెన్సీ విభాగానికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయినట్టు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగానే పిల్లలు చనిపోయారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఆక్సిజన్ కొరత వల్ల ఆ దవాఖానలో 21 మంది పిల్లలు మృతిచెందినట్టు జిల్లా ఎస్పీ నుంచి సమాచారం అందిందని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. దవాఖానను సందర్శించి ఒక నివేదిక రూపొందించాలని సీఎం ఆదిత్యనాథ్ తన మంత్రివర్గ సహచరులు ఇద్దరిని పురమాయించారు.


 


ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 63 కుటుంబాలకు గర్భశోకం మిగిల్చిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించింది. దవాఖాన నుంచి తనకు రూ.64 లక్షల వరకు బకాయిలు రావలసి ఉన్నదని, 30 మంది పసిపిల్లలు మరణించిన తరువాతనే ఆగమేఘాల మీద రూ.20.84లక్షలు తనకు చెల్లించారని దవాఖానకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కాంట్రాక్టు సంస్థ పుష్పా సేల్స్ తెలిపింది. మరోవైపు బీఆర్‌డీ దవాఖానలో తమ పిల్లలకు వైద్యులు సరైన చికిత్సనందించడం లేదని, కనీసం మందులు కూడా ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ అధికారులు లక్నోలోని ఆక్సిజన్ సరఫరా యూనిట్‌పై శనివారం దాడులు జరిపారు. దవాఖానకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేయడం పట్ల ఆ సంస్థపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.