బ‌స్సుల‌పై విరిగిప‌డ్డ‌ కొండ చ‌రియ‌లు

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 13, 2017, 02:04 PM
 

సిమ్లా: కొండ చ‌రియ‌లు రెండు బ‌స్సుల పై విరిగి ప‌డ‌టంతో బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్న 8 మంది మృతి చెందిన ఘ‌ట‌న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మండి - ప‌ఠాన్ కోట్ జాతీయ ర‌హ‌దారి పై జ‌రిగింది. ఆదివారం తెల్ల‌వారుజామున ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం మేర‌కు 8 మంది మృతి చెంద‌గా... 20 మంది మ‌ట్టి కింద చిక్కుకున్నారు. వెంట‌నే రంగంలోకి దిగిన ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మృతి చెందిన వారిని వెలికితీశారు. బ‌స్సుల్లోప‌ల చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు విశ్వ‌ప్ర‌యత్నాలు చేస్తున్నారు.  జాతీయ ర‌హ‌దారి పై సిమ్లాకు 220 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న కొట్రుపి లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. భోజ‌న విరామం కోసం రెండు బ‌స్సులు హైవే పై పార్క్ చేసి ఉన్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా కొండ చ‌రియ‌లు బ‌స్సుల మీద విరిగి ప‌డ‌టంతో ఓ బ‌స్సు దాదాపు 800 మీట‌ర్ల‌లోతులోకి జారి ప‌డి... మ‌ట్టి లో కూరుకుపోయింది. ఒక బ‌స్సు చంబా నుంచి మ‌నాలి కి వెళ్తుండ‌గా.. మ‌రో బ‌స్సు మ‌నాలి నుంచి క‌త్రా కు వెళ్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. చంబా నుంచి మ‌నాలి వెళ్తున్న బ‌స్సులో 47 మంది ఉండ‌గా... మ‌నాలి నుంచి క‌త్రా వెళ్తున్న బ‌స్సులో 8 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ దుర్ఘ‌ట‌న పై స్పందించిన ప్ర‌ధాని మోదీ... హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో గ‌త కొన్ని రోజులుగా కొండ చ‌రియ‌లు విరిగి ప‌డి ఎంతో మంది త‌మ ప్రాణాల‌ను కోల్పోతున్నార‌ని.. ఇది చాలా బాధాక‌ర‌మైన ఘ‌ట‌న అని అన్నారు. చ‌నిపోయిన‌, గాయ‌ప‌డిన వారి కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి ని తెలియ‌జేశారు.