ఆరేళ్లలో 3వేల మంది చిన్నారులు బలి

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 05:28 PM
 

ప్రాణ వాయువు సరఫరా ఆగిపోయి దాదాపు 30 మందికి పైగా చిన్నారులను బలితీసుకున్న బాబా రాఘవ్‌ దాస్‌ ఆసుపత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోనే అతిపెద్దది. అటువంటి వైద్యకళాశాల ఆసుపత్రిలో సరైన వసతులు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2012 నుంచి ఇప్పటి వరకూ ఈ ఆసుపత్రిలో దాదాపు 3వేల మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. యూపీలో మూడు దశాబ్దాలుగా 50వేల మంది చిన్నారులు కన్నుమూశారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులు మెదడు వాపు వ్యాధి బారిన పడి మరణించిన వారే కావడం గమనార్హం.


సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నియోజకవర్గమైన గోరఖ్‌పూర్‌లోని ఆసుపత్రుల్లో ఎక్కువగా వైద్యుల కొరత ఉంది. ఉన్న కొద్దిమంది వైద్యులు రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ‘అధిక సంఖ్యలో చిన్నారులు మెదడువాపు వ్యాధిగ్రస్తుల వార్డులోనే చేరుతున్నారు. ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారులు చనిపోతున్నారు’ అని వైద్యశిక్షణ తీసుకుంటున్న ఏకే.ప్రసాద్‌ పేర్కొన్నారు.


దోమల వల్ల వచ్చే వ్యాధులకు చికిత్స చేసేందుకు ఈ ఆసుపత్రిని ఓ నోడల్‌ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. అందుకోసం బీఆర్‌డీ మెడికల్‌ కళాశాల యాజమాన్యం మే నెలలో రూ.37కోట్ల నిధులు కావాలంటూ రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఈ నిధుల ద్వారా ఆసుపత్రిలో వార్డుల నిర్వహణ, ఐసీయూ, మందుల సేకరణ, వెంటిలేటర్స్‌, లేబొరేటరీ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భావించింది. ఆ ప్రతిపాదనను యూపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించగా అందుకు అంగీకారం తెలుపుతూ నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటికీ నిధులు రాలేదని.. వాటి కోసం ఎదురు చూస్తున్నామని బీఆర్‌డీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు.


ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ కేపీ.కుష్వాహ మాట్లాడుతూ.. మెదడు వాపు వ్యాధిగ్రస్తులకు అందించే చికిత్సకు సంబంధించిన విధానాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. క్రమశిక్షణతో పనిచేసే వైద్యుల నియామకాన్ని చేపట్టాలని ఆయన కోరారు. రోగుల కోసం ఎన్సెఫాలిటిస్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇటువంటి పరిస్థితులు వచ్చిన సమయంలో మంత్రులు, అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప ఆసుపత్రిలో కనీస సదుపాయాల విషయంలో పురోగతి మాత్రం రావడం లేదని ఆయన అన్నారు.


బీఆర్‌డీ ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవడంతో ఇప్పటి వరకు దాదాపు 30 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.