కర్ణాటకపై బీజేపీ నజర్‌

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 04:51 PM
 

బెంగుళూరు‌: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకపై బీజేపీ దృష్టి సారించింది. కర్నాటకలో అధికారం కైవసం చేసుకోవడం ద్వారా దక్షిణాదిలో బలం పెంచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఇదే లక్ష్యంతో కర్ణాటకలో శనివారం నుంచి మూడు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఈసారి బీజేపీ సర్కార్‌ కొలువుతీరాలని, అంతకు మించి తాను చెప్పేదేమీలేదని కార్యకర్తల సమావేశంలో తన పర్యటన లక్ష్యాన్ని స్పష్టం చేశారు.


ఉత్తరాదిలో పార్టీని విస్తరించిన ప్రధాని నరేం‍ద్ర మోదీ జైత్రయాత్ర వచ్చే ఏడాది కర్ణాటకకు చేరుకుంటుందని చెప్పారు. దక్షిణాదిలో గెలుపు సూచికగా కర్ణాటక బీజేపీ ఖాతాలోకి చేరడం ఖాయమని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలక కాంగ్రెస్‌ అవినీతిపై బీజేపీ నేతలు దీటుగా పోరాడుతూ ప్రతిపక్ష పాత్రను సమర్ధంగా పోషించారని ప్రశంసించారు. 2018 ఎన్నికల్లో విజయఢంకా మోగించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నేతలంతా రాష్ట్ర పార్టీ చీఫ్‌ బీఎస్‌ యెడ్యూరప్పకు సహకరించాలని కోరారు.