స్కూళ్లల్లో భద్రతపై సుప్రీంకోర్టు ఆగ్రహం

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 03:56 PM
 

పాఠశాలల భద్రతకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించకపోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. తమిళనాడులోని కుంభకోణం, హరియాణాలోని డబ్వాలీ పాఠశాలల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో అనేక మంది చిన్నారులు మరణించినా విపత్తు నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేయకపోవడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. పాఠశాలల భద్రతపై మార్గదర్శకాలు రూపొందించాలనుకుంటున్నారో, లేదో చెప్పాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విపత్తు నిర్వహణలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలోని విపత్తు నిర్వహణ సంస్థలు చూసుకుంటాయని న్యాయస్థానానికి కేంద్రం నివేదించింది. ఆయా సంస్థలన్నీ ఈ నెల 14 లోపు వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పాఠశాలల భద్రతపై మార్గదర్శకాలు రూపొందిస్తే సరిపోదని, వాటిని సరైన రీతిలో అమలు చేయడంపై దృష్టిపెట్టడం ఎంతో అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.