లంచ్‌ విరామానికి భారత్‌ 134/0

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 12:50 PM
 

క్యాండీ: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతోన్న చివరి టెస్టులో భారత్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి రోజు లంచ్‌ విరామ సమయానికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 134 పరుగులు సాధించి పటిష్ఠ స్థితిలో నిలిచింది.


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు ధావన్‌-రాహుల్‌ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి సెషన్‌ మొత్తం బ్యాట్స్‌మెన్లు తమ హవాను కొనసాగించారు. శ్రీలంక పేలవ ఫీల్డింగ్‌ ప్రదర్శనతో ఓపెనర్లు ఇచ్చిన క్యాచ్‌లను అందుకోలేకపోయారు. తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధావన్‌-రాహుల్‌ రెచ్చిపోయారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధశతకాలు నమోదు చేసుకున్నారు. తొలి వికెట్‌కి అజేయంగా 134 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లంచ్‌ విరామానికి 27 ఓవర్లు ఆడిన భారత్‌ వికెట్‌ ఏమీ నష్టపోకుండా 134 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో ధావన్‌ 64, రాహుల్‌ 67 పరుగులతో క్రీజులో ఉన్నారు. 


* ధావన తన టెస్టు కెరీర్లో 45 బంతుల్లోనే అర్ధశతకం సాధించడం ఇదే తొలిసారి.