యూపీలో మరో ముగ్గురు చిన్నారులు మృతి

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 12:46 PM
 

గోరఖ్‌పూర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌ దాస్‌ (బీఆర్‌డీ) ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రిలో చోటుచేసుకున్న విషాదంలో మరో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. శనివారం తెల్లవారుజాము నుంచి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆగస్టు 9 నుంచి ఈ ప్రమాదం కారణంగా మృతిచెందిన చిన్నారుల సంఖ్య 33కు చేరింది. కాగా.. ఐదు రోజుల్లో ఈ ఆసుపత్రిలో 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. వీరిలో అప్పుడే పుట్టిన శిశువులు కూడా ఉన్నారు.


ప్రాణవాయువు అందక గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆసుపత్రిలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆక్సిజన్‌ సరఫరా చేసే గుత్తేదారు సంస్థకు ఈ ఆసుపత్రి రూ. 70లక్షల మేరకు బకాయి పడింది. వాటిని చెల్లించకపోవడంతో సదరు సంస్థ ఆక్సిజన్‌ను నిలిపివేసింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వార్తా సంస్థ ఒకటి పేర్కొంది. గడిచిన 48 గంటల్లోనే 33 మంది చిన్నారులు మృతిచెందారు. గురువారం 23 మంది చనిపోగా.. శుక్రవారం ఏడుగురు.. శనివారం ఉదయం మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. విషయం వెలుగులోకి రాకముందు బుధవారం 9 మంది, మంగళవారం 12 మంది, సోమవారం మరో 9 మంది చిన్నారులు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ వారంలో 63 మంది చిన్నారులు ఈ ప్రమాదానికి బలైనట్లు తెలుస్తోంది.