నిద్రిస్తున్న భార్యను హతమార్చిన భర్త

  Written by : Suryaa Desk Updated: Mon, Sep 13, 2021, 12:42 PM
 

కర్నూలు నగరంలో శివారులోని లక్ష్మీపురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిద్రిస్తున్న భార్యను ఓ కానిస్టేబుల్ దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కానిస్టేబుల్ చంద్రశేఖర్ దిండుతో హత్య చేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.


అనంతపురం జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మృతురాలు ధరణి (29) కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహించే సమయంలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ చంద్రశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. 2018లో వీరు వివాహం చేసుకోగా. వీరికి ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్లుగా వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లోనే ధరణి మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


చంద్రశేఖర్, అతని కుటుంబీకులు తమ కుమార్తెను చంపేశారని మృతురాలి తల్లి అనంతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతామని ఎస్సై శరత్ కుమార్ రెడ్డి తెలిపారు.