హంద్రీ నదిపై వంతెన లేక అవస్థలు

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 07, 2021, 04:19 PM
 

చదువు, వైద్యం సహా ఇతర ముఖ్యమైన పనులకు.. వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వెళ్లాలంటే ఏరు దాటాల్సిందే. వంతెన లేకపోవడంతో గ్రామీణులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నది దాటాల్సిన భయానక పరిస్థితి. చుట్టూ తిరిగి వెళ్లాలంటే రెండింతలు కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలి. సకాలంలో ఆస్పత్రికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి.


కర్నూలు జిల్లాలో కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో గోరంట్ల, ఎస్‌హెచ్‌ ఎర్రగుడి గ్రామాల మధ్య హంద్రీ నదిపై వంతెన నిర్మించాలన్న 4 దశాబ్దాల కల అందని ద్రాక్షలా మారింది. గ్రామస్థులకు ఏ అవసరం వచ్చినా కర్నూలు వెళ్లాలి. కర్నూలుతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే నది దాటాలి. అలాగే పొలం పనులకు ఏరు దాటే వెళ్లాలి. వంతెన లేకపోవడంతో 6 గ్రామాల ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.


కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లోని ఆరు గ్రామాల్లో 25 వేల మంది ఉంటారు. 50 శాతం ప్రజలకు వ్యవసాయమే ఆధారం. హంద్రీకి ఇవతల గోరంట్ల గ్రామస్థులకు చెందిన దాదాపు 2వేల ఎకరాల పొలాలన్నీ హంద్రీకి అవతల ఉండే 5 గ్రామాల పరిధిలోనే ఉన్నాయి. రోజూవారీ పనులకు వెళ్లేందుకు, పంట చేతికందినప్పుడు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నదికి ఆవలి వైపు ఉన్న గ్రామాల రైతులు పంటను నది మార్గం గుండానే కర్నూలు మార్కెట్‌ యార్డుకు తరలిస్తారు.


ఎస్‌హెచ్‌ ఎర్రగుడి నుంచి హంద్రీ నది మీదుగా కర్నూలుకు రావాలంటే దూరం 32 కిలోమీటర్లు. గోరంట్ల నుంచి అమడగుంట్ల, నాగలాపురం, పెదపాడు మీదుగా కర్నూలుకు వస్తే 30 కిలోమీటర్లు. అయితే ఎర్రగుడి నుంచి కృష్ణగిరి, వెల్దుర్తి, జాతీయ రహదారి మీదుగా కర్నూలుకు చేరుకోవడానికి ఏకంగా 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో రైతులు పంట ఉత్పత్తులను నది మీదుగానే తీసుకెళ్లాల్సి వస్తోంది.


పేరుకు లద్దగిరిలో 30 పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ పనిచేయాల్సిన ముగ్గురు వైద్యులకుగానూ ఒక్కరే అందుబాటులో ఉంటున్నారు. మరో ఇద్దరు కర్నూలులో నివసిస్తూ గైర్హాజరీలో ఉంటున్నారు. దీంతో స్థానికులు అత్యవసర వైద్య సేవలకు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి పరుగులు తీయాల్సి వస్తోంది. ఎర్రగుడి, మన్నెగుంట, కొత్తపల్లె ఇతర గ్రామాల ప్రజలు కాన్పులకు కూడా ఈ నది ద్వారానే కర్నూలుకు వెళ్తుంటారు. ఈ ప్రమాదకర ప్రయాణంలో 2020-21 మధ్య ఇప్పటిదాకా ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి.


సకాలంలో వైద్యం అందక..


జూన్‌ 9న ఎర్రగుడికి చెందిన చాకలి పెద్ద సుంకన్న శ్వాసకోస వ్యాధితో బాధపడుతుండగా కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యంలో మృతి చెందాడు. హంద్రీ నది మీదుగా వెళ్లుంటే ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 28 న ఎర్రగుడిలో కృష్ణ అనే యువకుడికి ఛాతీ నొప్పి రావడంతో కృష్ణగిరి మీదుగా హుటాహుటిన కర్నూలుకు తరలించే క్రమంలో తుది శ్వాస వదిలాడు. నది లో నీళ్లు నిండుగా ఉండటంతో చుట్టూ తిరిగి వెళ్లా ల్సి వచ్చిందని, లేకుంటే బతికేవాడని గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.