చిత్తూరు జిల్లాలో 60 అడుగుల దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 03, 2021, 12:58 PM
 

చిత్తూరు జిల్లాలో 60 అడుగుల దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఆవిష్కృతమైంది. గంగవరం మండలంలో 60 అడుగుల వైఎస్ విగ్రహాన్ని వైయస్సార్ పుష్కర వర్ధంతి రోజైన నిన్న దండపల్లి నాలుగురోడ్ల కూడలిలో ఏర్పాటు చేశారు. పలమనేరుకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు సి.వి కుమార్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ పై ఉన్న అభిమానంతో 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైయస్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.అయితే, ఈ విగ్రహావిష్కరణ సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించాలని సి.వి కుమార్ అనుకున్నారు. అది వీలు కాకపోవడంతో వైఎస్ అభిమానితోనే ఆవిష్కరించారు. దివంగత నేత వైయస్సార్ అభిమాని సుబ్బిరెడ్డి చేతుల మీదుగా 60 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని సీవీ కుమార్ ఆవిష్కరింపచేశారు. సీవీ కుమార్ భార్య అయిన పలమనేరు మున్సిపల్ మాజీ చైర్మన్ శారదతోపాటు, కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.


కాగా, ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడతోపాటు, స్థానిక వైసీపీ నేతలు కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. పలమనేరులో గత కొన్ని రోజులుగా వైసీపీలో ఉన్న వర్గపోరు కారణంగానే జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.