వాట్సాప్ తన యూజర్స్ కు కీలక సూచనలు చేసింది. వాట్సాప్ మోడ్ యాప్స్‌ను ఉపయోగించొద్దని సూచించింది. మోడ్ యాప్స్ లేదా మోడిఫైడ్ యాప్స్ లో సాధారణ యాప్స్ లో ఉన్న ఫీచర్ల కంటే కొన్ని ఫీచర్స్ అదనంగా ఉంటాయి. అయితే ఇలాంటి యాప్స్ లో సెక్యూరిటీ లోపాల కారణంగా హ్యాకర్స్ యూజర్ ల ఫోన్లలోని సమాచారాన్ని సులువుగా దొంగిలిస్తున్నారని తెలిపింది. వాట్సాప్‌లో ఉన్న విధంగా మోడ్ యాప్స్‌లో సెక్యూరిటీ ఫీచర్స్ ఉండవని పేర్కొంది. అందుకే యూజర్స్ వాట్సాప్ మోడ్ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోవద్దని సూచిస్తోంది.
వాట్సాప్ మోడ్ యాప్స్‌లో ఎఫ్‌ఎండబ్ల్యూ వాట్సాప్ 16.80.0లో టార్జాన్ ట్రియాడా వైరస్ ఉన్నట్లు గుర్తించామని వాట్సాప్ తెలిపింది. ఈ వెర్షన్ యాప్‌ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే, వెంటనే అందులోని వైరస్ ఫోన్లోని మొత్తం డేటాను హ్యాకర్స్‌కి చేరవేస్తోందని కాస్పర్‌స్కై అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఫోన్లలో స్క్రీన్ మొత్తం కనిపించేలా ప్రకటనలు ఇవ్వడం, సబ్స్క్రిప్షన్ ఖాతాల్లోకి యూజర్ ప్రమేయం లేకుండా లాగిన్ కావడం, బ్యాంక్ అకౌంట్లలోకి ప్రవేశించడం లాంటి వాటిని తాము గుర్తించినట్లు కాస్పర్‌స్కై పేర్కొంది. అందుకే యూజర్స్ మోడ్ యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకోవద్దని వాట్సాప్ సూచిస్తోంది. అలానే ప్లే స్టోర్ నుంచి కొత్త యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.