ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామ స్థాయి కోవిడ్ యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయాలి - జిల్లా కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 20, 2021, 03:23 PM

శ్రీకాకుళం, మే 20 : గ్రామస్థాయి కోవిడ్ యాజమాన్య కమిటీ (కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ) ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ నివారణపై గురువారం అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ను  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్థాయిలో కోవిడ్ యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. శుక్రవారం మండల స్థాయిలో సర్పంచులు అందరితో యాజమాన్య కమిటీ ఏర్పాటుపై సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ స్థాయి యాజమాన్య కమిటీలో సర్పంచ్ అధ్యక్షులుగా ఉంటారని, ఏఎన్ఎం సమన్వయకర్తగా ఉంటారని, ఆశా, వాలంటీర్లు, వార్డు సభ్యులు, పారిశుద్ధ్య కమిటీ సభ్యులు   సభ్యులుగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. గ్రామస్థాయి యాజమాన్య కమిటీ గ్రామస్థాయిలో కోవిడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని ఆయన తెలిపారు. పాజిటివ్ కేసు కలిగిన ఇంటివద్ద బారికేడింగ్ నిర్మించి ఆ ఇంటి నుండి పాజిటివ్ వచ్చిన వ్యక్తితో పాటు ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న వ్యక్తులు బయటకు రాకుండా చూడాలని ఆయన అన్నారు. కరోనా లక్షణాలు లేదు అనే నెపంతో ప్రైమరి కాంటాక్ట్ లు అనేక మంది బయటకు తిరుగుతున్నారని, అటువంటి అవకాశాన్ని ఎవరికీ ఇవ్వరాదని ఆయన స్పష్టం చేసారు. ఒక ఇంటిలో ఒకరికి పాజిటివ్ ఉంటే మిగిలిన కుటుంబ సభ్యులకు పాజిటివ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రైమరి కాంట్రాక్టులు బయట తిరగడం వలన కరోనా వ్యాప్తి అధికం అవుతుందని ఆయన అన్నారు. గ్రామస్థాయిలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా ఉపాధి హామీ పథకానికి వస్తున్నట్లు సమాచారం ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అటువంటి వ్యక్తులు ఇంటి వద్దనే ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అటువంటి వ్యక్తులకు పనులు కల్పించరాదని ఆయన పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో పాటు ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న వ్యక్తుల జాబితాలను గ్రామంలో గ్రామ ఐక్య సంఘం అధ్యక్షులకు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కు ప్రతి రోజూ అందించాలని ఆయన ఆదేశించారు. గ్రామంలో గ్రామ యాజమాన్య కమిటీ పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆయన పేర్కొంటూ గ్రామ పంచాయతీ పరిధిలో రద్దీగా ఉండే మార్కెట్లు, దుకాణాలు తదితర ప్రాంతాల్లో మరింత ఎక్కువ పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ పారిశుద్ధ్య పనులను నిర్లక్ష్యం చేయడానికి లేదని ఆయన చెప్పారు. గ్రామంలో కరోనా లక్షణాలు ఉన్నవారు, కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ గా ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించి వారి నమూనాలను తీయాలని అటువంటి సమాచారాన్ని సేకరించాలని ఆయన ఆదేశించారు. గ్రామంలో పంచాయతీ సర్పంచ్ విధిగా మాస్కులు ధరించి ఆదర్శవంతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించడం, వ్యక్తుల మధ్య దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రపరచడం విధిగా నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ అంశాలను గ్రామాల్లో ఎక్కువగా తెలియజేయాలని సూచించారు.


 పాజిటివ్ లేని గ్రామాలకు ప్రోత్సాహకాలు :


పాజిటివ్ కేసులు లేని గ్రామాలకు ప్రోత్సాహకాలు అందించుటకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. గ్రామం నిర్దేశించిన సమయంలో జీరో పాజిటివ్ కేసులతో ఉంటే అటువంటి గ్రామాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించుటకు యోచిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏ గ్రామం కరోనా రహిత గ్రామంగా ఆవిర్భావం చెందుతుందో పరిశీలించాలని అన్నారు. కరోనా రహిత గ్రామాలుగా ఆవిర్భావం చెందుటకు ప్రజల భాగస్వామ్యం ఏ మేరకు ఉందో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి వ్యక్తి ఆదర్శవంతంగా ఉంటూ మాస్కులను ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ, చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలని అన్నారు. గ్రామంలో కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు లేదా అనుమానం ఉన్న వ్యక్తులు కూడా పరీక్షలు చేసుకోవాలని తద్వారా గ్రామం పూర్తిగా పాజిటివ్ కేసులు లేని గ్రామాలుగా ఉండాలని వివరించారు. ఏ గ్రామం మొదటి గ్రామంగా వస్తుందో వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు.


 జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ హోమ్ ఐసోలేషన్ , హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారిని వాలంటీర్లు, ఏఎన్ఎంలు  సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని అన్నారు. మెడికల్ కిట్లు అందజేయాలని, కంటైన్మెంట్ జోన్లను పక్కాగా అమలు చేయాలని ఆయన సూచించారు.


 ఈ టెలీ కాన్ఫరెన్స్ లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సిహెచ్. శ్రీధర్, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడ, రెవిన్యూ డివిజనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, వైద్య అధికారులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com