ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నానికి ‘సంజీవని’ ప్రగతి భారత్ ఫౌండేషన్ కోవిడ్ కేర్ సెంటర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 14, 2021, 04:22 PM

*ఏ ఒక్క రోగీ ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోకుండా ఏర్పాట్లు*


*ప్రాణాపాయ చికిత్సలో వాడే రెమిడెసివిర్ కూడా ఉచితం*


*డీఎంహెచ్ఓ, ఆంధ్రా మెడికల్ కాలేజ్ సహకారంతో చర్యలు*


*మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన ప్రగతి భారత్ ఫౌండేషన్*


విశాఖపట్నం:మే 14.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో విశాఖపట్నం నగరంలో కరోనావైరస్ సోకిన ఏ ఒక్క రోగీ ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోకూడదన్న లక్ష్యంతో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి చొరవతో ప్రగతి భారత్ ఫౌండేషన్ కోవిడ్ కేర్ సెంటర్‌ ఏర్పాటైంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆంధ్రా మెడికల్ కాలేజ్‌ సిబ్బంది సహకారంతో షీలా నగర్‌లో ఈ కేంద్రం వైద్య సేవలు అందిస్తోంది.


కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఇటీవల కేజీహెచ్, విమ్స్‌ ల్లో పర్యటించారు. పీపీఈ కిట్ ధరించి కోవిడ్ వార్డుల్లోకి వెళ్లిన విజయసాయి రెడ్డి అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అలాగే రోగుల బంధువులను కూడా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురి నుంచి అందిన సలహాలు, సూచనలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా విశాఖపట్నం ప్రజలకు పలు రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా ఒక కోవిడ్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


*12 వేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సరఫరా:*


ఈ కేంద్రంలో మౌలిక సదుపాయాలను ప్రగతి భారత్ ఫౌండేషన్ ఖర్చులతో ఏర్పాటు చేశారు. 300 పడకల సామర్థ్యంతో ఏర్పాటైన ఈ ప్రగతి భారత్ కోవిడ్ కేర్ సెంటర్‌లో అన్ని పడకలకూ నిరంతరం ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఇందుకోసం 12 వేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్‌ సరఫరాకు మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ కేంద్రంలో..


ఒక్కోటీ 3750 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన 6.5 కిలో లీటర్ల ట్యాంకర్లు రెండు


ఒక్కోటీ 10 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన సిలిండర్లు 200


ఒక్కోటీ 7.5 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన సిలిండర్లు 200 


వెయ్యి క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు 150 ఉన్నాయి.


ప్రగతి భారత్ కోవిడ్ కేర్ సెంటర్‌కి నిరంతరాయంగా పైపులైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. ఇందుకోసం రెండు ఆక్సిజన్ ట్యాంకర్లు, 200 పెద్ద ఆక్సిజన్ సిలిండర్లను వినియోగిస్తారు. 


*సమస్యలు వచ్చినా ఆక్సిజన్ సరఫరా ఆగకుండా ఏర్పాట్లు:*


ఒకవేళ ఈ పైపులైన్ ఆక్సిజన్ సరఫరాలో ఏమైనా లోపాలు వస్తే, రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గాను రోగుల బెడ్ పక్కనే ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లను పెట్టారు. 


గ్రౌండ్ ఫ్లోర్‌లో మొత్తం 160 పడకలు ఉండగా.. వాటి కోసం 47 లీటర్ల సామర్థ్యం కలిగిన 80 ఆక్సిజన్ సిలిండర్లను, మరో 80 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సిద్ధంగా ఉంచారు. 


ఫస్ట్ ఫ్లోర్‌లో 140 పడకలు ఉండగా.. వాటి కోసం కోసం 47 లీటర్ల సామర్థ్యం కలిగిన 70 ఆక్సిజన్ సిలిండర్లను, మరో 70 ఆక్సిజన్ కాన్సన్ట్రేర్లను సిద్ధంగా ఉంచారు. నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా కోసం.. ఎప్పటికప్పుడు ఖాళీ అయిన సిలిండర్లను నింపేందుకు 50 సిలిండర్లను వాడనున్నారు. ఆక్సిజన్ అందక, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఈ కేంద్రానికి వైద్యం కోసం వచ్చే రోగుల ప్రాణాలు కాపాడేందుకు 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ప్రగతి భారత్ కోవిడ్ కేర్ సెంటర్‌లో లాబీతో పాటు వివిధ ప్రదేశాల్లో సిద్ధంగా ఉంచారు. ఒకవేళ ఈ కాన్సన్ట్రేటర్లకు ఏవైనా మరమ్మత్తులు వస్తే వాటి స్థానంలో వాడేందుకు గాను 20 కాన్సన్ట్రేటర్లను సిద్ధంగా ఉంచారు.


*మూడు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు:


300 పడకలపైనా పేషెంట్లు చికిత్స పొందుతూ పూర్తి స్థాయిలో ఆక్సిజన్ సరఫరాపై ఆధారపడిన నేపథ్యంలో సగటున నిమిషానికి 6 లీటర్ల చొప్పున, రోజుకు 2500 క్యూబిక్ మీటర్ల చొప్పున ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఈ లెక్కన ప్రగతి భారత్ కోవిడ్ కేర్ సెంటర్‌లో నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వ ఉంటుంది. దీనికి తోడు మరో 2 రోజులకు సరిపడా ఆక్సిజన్ కోసం ముందస్తు ఏర్పాట్లు కూడా జరిగాయి. ప్రగతి భారత్ కోవిడ్ కేర్ సెంటర్‌లో ఏ క్షణంలోనైనా ఐదు వేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటుంది. తద్వారా బయటి నుంచి లిక్విడ్ ఆక్సిజన్ రాకపోకలు నిలిచిపోయినప్పటికీ కనీసం మూడు రోజుల పాటు రోగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆక్సిజన్ అందుతుంది.


*ఉచితంగా రెమిడెసివిర్:*


ఆక్సిజన్ స్థాయిలు తీవ్రంగా పడిపోయి ఐసీయూల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లకు రెమిడెసివిర్ మందుతో చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు వైద్యులు. దీంతో రెమిడెసివిర్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే, ప్రగతి భారత్ కోవిడ్ కేర్ సెంటర్‌లో మాత్రం రోగులకు అవసరాన్ని బట్టి రెమిడెసివిర్‌ను ఉచితంగా అందజేయనున్నారు.  ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా రోగుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ప్రగతి భారత్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ కోవిడ్ కేర్ సెంటర్‌ ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో సామాన్యులకు గొప్ప ఉపశమనం కానుంది.


*ఉచితంగా మూడు పూటలా పౌష్టికాహారం, సాయంత్రం అల్పాహారం:


కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా వైద్య చికిత్స నియమ నిబంధనలను అనుసరించి ఏర్పాటైన ఈ ప్రగతి భారత్ కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన కరోనా రోగులకు వైద్యుల సిఫారసు మేరకు చికిత్స అందచేస్తారు. ప్రగతి భారత్ కోవిడ్ కేర్ సెంటర్‌లో వైద్యం పూర్తిగా ఉచితం. రోగులు, రోగి బంధువులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. వారికి మూడు పూటలా పౌష్టిక విలువలు పుష్కలంగా ఉన్న భోజనం, సాయంత్రం అల్పాహారం కూడా ఉచితంగా అందుతుంది.  ప్రగతి భారత్ కోవిడ్ కేర్ సెంటర్‌లో రోగులకు అవసరమయ్యే మందులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సమకూరుస్తుంది. అలాగే, రెండు అంబులెన్సులను కూడా ఆరోగ్య శాఖ సమకూర్చింది. కరోనా రోగుల స్థితిగతులను తెలుసుకునేందుకు అవసరమైన పరీక్షల కోసం ఒక ల్యాబ్‌ను కూడా ప్రగతి భారత్ కోవిడ్ కేర్ సెంటర్‌లో ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com