కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ సదుపాయాలు

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 24, 2021, 02:44 PM
 

కర్నూలు నగరంలోని వైద్య కళాశాల, సర్వజన వైద్యశాలకు మహర్దశ వచ్చింది. నేడు-నాడులో భాగంగా వైద్య కళాశాల, పెద్దాస్పత్రికి కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో పెద్ద ఆసుపత్రి మూడు జీ+4 భవనాలు, వైద్య కళాశాలలో రెండు జీ+4 భవనాలు నిర్మించనున్నారు. సర్వజన వైద్య కళాశాలలో ప్రస్తుతమున్న ఓల్డ్‌ గైనిక్‌ విభాగం, జనరల్‌ మెడిసిన్‌ వార్డులతోపాటు జనరల్‌ సర్జరీ విభాగం పాత భవనాల స్థానంలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించనున్నారు.


ఆసుపత్రిలో ఒక్కో బ్లాక్‌ను సుమారు 3. 33 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో, మూడు బ్లాక్‌లు కలిపి దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేస్తారు. దీంతోపాటు ఆధునిక యంత్రాల కోసం రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. కర్నూలు వైద్య కళాశాలలో ఒక బ్లాక్‌ను సుమారు 2. 5 లక్షల చదరపు అడుగుల్లో ఉండేలా నిర్మాణాలు చేపడతారు.


మరో బ్లాక్‌లో ల్యాబ్‌లు, న్యూసీఎల్‌జీలు, నాన్‌ క్లినికల్‌ విభాగాలు, వైద్య కళాశాల పరిపాలన విభాగాన్ని ఏర్పాటుచేస్తారు. ప్రస్తుతమున్న బయోకెమిస్రీ, అనాటమీ, మైక్రో బయాలజీ, పైథాలజీ విభాగాలను తొలగించి వాటి స్థానాల్లో కొత్త నిర్మాణాలు చేపడతారు. ఫోరెన్సిక్‌ విభాగం మాత్రం అలాగే ఉంటుంది. మిగతా పాత భవనాలను తొలగిస్తారు. దీనికి అనుసంధానంగా రెండు యూజీ విద్యార్థుల వసతిగృహాలను సిద్ధం చేస్తారు.