అంగరంగ వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

  Written by : Suryaa Desk Updated: Thu, Mar 11, 2021, 03:03 PM
 

ఇల కైలాసం శ్రీశైలం భక్తజన ప్రభంజనంతో సందడిగా మారింది. దేవదేవుడు జ్యోతిర్లింగ స్వరూపుడిగా అవతరించే శివరాత్రి ఘడియలను వీక్షించేందుకు అశేష భక్తజనం శ్రీశైలానికి చేరుకుంటున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఎనిమిదో రోజు గురువారం తెల్లవారుజాము నుంచి భక్తులు పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలానికి పోటెత్తారు.


ఏడాది తర్వాత భక్తులను పాతాళగంగ పుణ్యస్నానాలకు అనుమతించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఆలయ ప్రాంగణం, వసతి సముదాయాలు, క్షేత్రంలోని ఉద్యానవనాల ప్రాంగణాలు భక్తులతో నిండిపోయాయి. ఆదిదంపతులు గజ వాహనంపై శ్రీగిరి పురవీధుల్లో విహరించారు.


దేవస్థానం కళావేదికలపై కళాకారిణులు విభిన్నంగా కూచిపూడి, భరతనాట్యాలు ప్రదర్శించి మంత్రముగ్ధులను చేశారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను బుధవారం జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి, రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు దంపతులు దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వాణీమోహన్‌ శ్రీశైలం చేరుకున్నారు.