ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు మహిళల ప్రపంచ కప్‌ రెండో సెమీఫైనల్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2017, 09:15 AM

ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఆరుసార్లు చాంపియన్‌ అయితే భారత్‌ ఒక్కసారి మాత్రమే ఫైనల్‌ వరకు చేరగలిగింది.ఏం ఫర్వాలేదు, మరోసారి ఫైనల్‌ చేరగల సామర్థ్యం మన ఈ జట్టుకు ఉంది. ఇరు జట్ల మధ్య 42 మ్యాచ్‌లు జరిగితే, భారత్‌ 34 ఓడి, 8 మాత్రమే గెలిచింది. ఆందోళన అనవసరం, క్రికెట్‌లో రికార్డులు తిరగరాయడం అసాధ్యమేమీ కాదు!  లీగ్‌ దశ ఆరంభంలో చెలరేగి ఆ తర్వాత తడబడ్డా... న్యూజిలాండ్‌పై అద్భుత విజయం మన మహిళల  జట్టు  ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. అదే స్ఫూర్తితో ఆసీస్‌పై అద్భుతంగా ఆడి మనోళ్లు తుది పోరుకు అర్హత సాధిస్తారా? తన చివరి వరల్డ్‌ కప్‌ ఆడుతున్న కెప్టెన్‌ మిథాలీ రాజ్‌తో పాటు ఇతర సభ్యులు కూడా తమ కెరీర్‌లో మరో సంచలన విజయంలో భాగమవుతారా?  


డెర్బీ: మిథాలీ రాజ్‌ నేతృత్వంలోనే భారత మహిళల క్రికెట్‌ జట్టు మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా నేడు జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆస్ట్రేలియాతో ముఖాముఖి రికార్డు, టోర్నీ లీగ్‌ దశలో అదే జట్టు చేతిలో పరాజయం భారత్‌కు ప్రతికూలంగా కనిపిస్తున్నా... అచ్చొచ్చిన మైదానంలో అనూహ్య ఫలితం సాధించగల సత్తా కూడా ‘ఉమెన్‌ ఇన్‌ బ్లూ’కు ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ 2005 తర్వాత ప్రపంచకప్‌లో మరోసారి ఫైనల్‌ చేరినట్లవుతుంది. లీగ్‌ దశలో భారత్‌ 5 విజయాలు సాధించగా, ఆస్ట్రేలియా 6 గెలిచింది. ఇరు జట్ల మధ్య పోరులో కంగారూలు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.


మంధన ఫామ్‌పై ఆందోళన...


కఠినమైన ప్రత్యర్థే అయినా భారత బ్యాట్స్‌మెన్‌ తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇస్తే భారత్‌ భారీస్కోరుకు అవకాశం ఉంటుంది. మరోసారి మిథాలీ రాజ్‌పై భారత్‌ ఆధార పడుతోంది. జట్టు తరఫున టాప్‌ స్కోరర్‌గా ఉన్న మిథాలీ, ఆసీస్‌తో గత మ్యాచ్‌లో మరీ నెమ్మదిగా ఆడి విమర్శలపాలైంది. దానిని సరిదిద్దుకునేందుకు ఆమెకు ఇది మంచి అవకాశం. అయితే రాజ్‌కంటే స్మృతి మంధన ఫామ్‌ భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. తొలి రెండు మ్యాచ్‌లలో 90, 106 పరుగులు చేసిన ఆమె, ఆ తర్వాత వరుసగా 2, 8, 4, 3, 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీస్‌లో ఆమె చెలరేగడం అవసరం.


ఆసీస్‌పైనే సెంచరీ చేసిన పూనమ్‌ రౌత్‌ మరో భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టింది. హర్మన్‌ప్రీత్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మల సహకారం కూడా జట్టు ముందంజ వేయడంలో ఉపయోగపడింది. వీరంతా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో మరోసారి స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ కీలకం కానుంది. న్యూజిలాండ్‌పై ఆమె ఒంటిచేత్తో విజయం అందించింది. 2016 ఫిబ్రవరిలో భారత్‌ ఆఖరిసారి ఆసీస్‌ను ఓడించినప్పుడు రాజేశ్వరి 2 కీలక వికెట్లు పడగొట్టింది. ప్రధాన పేసర్లు జులన్, శిఖా పాండే మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.


లానింగ్‌ ఫిట్‌...


జట్టులో 9వ స్థానం వరకు కూడా బ్యాటింగ్‌ చేయగల ప్లేయర్లు ఉండటం ఆస్ట్రేలియా ప్రధాన బలం. టోర్నీలో సంయుక్తంగా ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు సాధించిన ఓపెనర్లు బెథ్‌ మూనీ, నికోల్‌ బోల్టన్‌ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఎలీస్‌ పెర్రీ అద్భుత ప్రదర్శన ఆసీస్‌ను దూసుకుపోయేలా చేస్తోంది. టోర్నీలో 366 పరుగులు చేయడంతో పాటు ఆమె 9 వికెట్లు కూడా పడగొట్టింది. భుజం గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్‌ లానింగ్‌ కోలుకొని తిరిగి వస్తుండటం ఆసీస్‌ బలాన్ని పెంచింది. ఆసీస్‌ స్పిన్నర్లు జొనాసెన్, ఆష్లీ, బీమ్స్‌ కలిసి మొత్తం 27 వికెట్లు పడగొట్టడం విశేషం. అన్ని రంగాల్లో మెరుగ్గా కనిపిస్తున్న ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత్‌ తమ స్థాయికి మించిన ప్రదర్శనను కనబర్చాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com