రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన వైఎస్ జగన్

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 03:51 PM
 

విజయవాడ: రాజధాని అమరావతిలో తొలిసారి జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీకి వచ్చిన వైఎస్ జగన్ ఓటింగ్ ప్రారంభమైన కొంత సమయానికి అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్‌లో ఓటేశారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత వైఎస్ జగన్ అక్కడే తన చాంబర్‌లో కొద్దిసేపు ఉండి పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు నేటి ఉదయం హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌కు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఎమ్మెల్యేలతో ఆయన భేటీ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాసనసభ్యులకు ఆయన వివరించారు. భేటీ అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు బస్సులో అసెంబ్లీకి వెళ్లారు.