పీఎల్ఏ భూ భాగంలో చైనా మిలిట‌రీ డ్రిల్స్‌!

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 01:11 PM
 

బీజింగ్‌: సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, వేడిని మరింతగా పెంచుతూ చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టిబెట్ భూ భాగంలో లైవ్ ఫైర్ డ్రిల్స్ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను చైనా అధికార సెంట్రల్ టెలివిజన్ విడుదల చేసింది. ఈ డ్రిల్స్ ఎప్పుడు జరిగాయన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించనప్పటికీ, దేశానికి చెందిన రెండు సైనిక దళాలు పాల్గొన్నాయని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇండియా, చైనా మధ్య ఉన్న వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపంలోనే ఈ డ్రిల్స్ జరిగాయని పేర్కొంది. బ్రహ్మపుత్రా నది వెనుకవైపు కనిపిస్తుండటంతో ఇది భారత్ కు సమీపంలోనే జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. 11 గంట‌ల పాటు ఈ లైవ్ ఫైర్ డ్రిల్ జ‌రిగిన‌ట్లు గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక వెల్ల‌డించింది. అయితే ఎప్పుడు జరిగింద‌న్న‌ది మాత్రం చెప్ప‌లేదు. పీఎల్ఏకు చెందిన టిబెట్ మిలిట‌రీ క‌మాండ్ ఈ డ్రిల్స్ నిర్వ‌హించిన‌ట్లు ఆ ప‌త్రిక తెలిపింది. ఈ డ్రిల్స్ ద్వారా భార‌త ప్ర‌భుత్వం, ఆర్మీకి గ‌ట్టి హెచ్చ‌రిక‌లు చైనీస్ ఆర్మీ పంపించింది. ఇప్ప‌టికీ అరుణాచ‌ల్‌లోని చాలా ప్రాంతాల‌ను త‌మ భూభాగాలుగా చెప్పుకుంటున్న‌ది. మ‌న బ్ర‌హ్మ‌పుత్ర‌గా పిలిచే యార్లుంగ్ జాంగ్‌బో న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో ఈ డ్రిల్స్ జ‌రిగాయి. సంయుక్తంగా దాడులు చేసేందుకు వివిధ మిలిట‌రీ విభాగాలు ఒక్క‌చోటికి రావ‌డం, యాంటీ ట్యాంక్ గ్రెనేడ్స్‌, మిస్సైల్స్ ప‌రీక్ష‌లు డ్రిల్‌లో భాగంగా నిర్వ‌హించిన‌ట్లు గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక తెలిపింది. అంతేకాదు శ‌త్రువు ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌ను గుర్తించే రాడార్ యూనిట్లు కూడా ఈ డ్రిల్‌లో పాల్గొన్నాయి. ఇదిలావుడగా, ఈ నెల 10వ తేదీని టిబెట్ సైనిక దళాలు సైతం ఇదే తరహా విన్యాసాలు చేసిన సంగతి తెలిసిందే.