విషాదం.. తల్లితో పాటు పిల్లల్ని బలిగొన్న వాటర్ హీటర్

  Written by : Suryaa Desk Updated: Sat, Dec 19, 2020, 02:37 PM
 

కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాలహర్వి మండలం గుళ్లెం గ్రామంలో విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్, కవిత దంపతులకు ఇద్దరు కుమారులు. రోజూలాగే శనివారం ఉదయం నీళ్లు వేడి చేయడానికి హీటర్ తో పెట్టే సమయంలో వాటర్ హీటర్ కు చేయి తగలడంతో కవిత (35) విద్యుదాఘాతానికి గురైంది. పక్కనే ఉన్న పిల్లలు నిశ్చల్ కుమార్ (10), వెంకటసాయి (8) తల్లిని పట్టుకున్నారు. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలో ముగ్గురు ఒకేసారి మరణించడంతో కవిత భర్త కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు హాలహర్వి ఎస్సై సురేందర్ తెలిపారు.