జగన్ పాలనలో ఏపీ జుదాంధ్రప్రదేశ్ గా మారింది: టీడీపీ నేత దివ్యవాణి

  Written by : Suryaa Desk Updated: Mon, Nov 09, 2020, 04:01 PM
 

రాష్ట్ర ప్రజలంతా సంతోషంలేని జీవితాలు గడుపుతున్నారని, వారి జీవితాలను, రాష్ట్రాన్ని పట్టించుకోకుండా భావితరాలవారంతా దిక్కుతోచని స్థితికిచేరేలా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, ఆయనకు ఏమాత్రం తీసిపోని విధంగా అధికారపార్టీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని టీడీపీ మహిళానేత దివ్యవాణి విమర్శించారు. పేకాటకేంద్రాలు నిర్వహిస్తున్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై, ఊసరవెల్లి ముఖ్యమంత్రి జగన్ ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబునాయుడు తనకష్టంతో, మేథాశక్తితో ఏపీని అభివృద్ధికి చిరునామాగా మారిస్తే, ఇప్పుడున్నవారు రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్ గా మార్చారని ఆమె మండిపడ్డారు.
కర్నూల్లో మంత్రి జయరామ్ పేకాట కేంద్రాలు నడుపుతున్నాడని, ఆ విషయం ప్రజలు మర్చిపోకముందే, ఉండవల్లి శ్రీదేవి పేకాట కేంద్రాల బాగోతం ఆధారాలతో సహా బట్టబయలైందన్నారు. వైసీపీనేతలతో పేకాట కేంద్రాలు నడుపుతున్న శ్రీదేవి, ఎమ్మెల్యే పదవికి అనర్హురాలని, ఆమె వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని దివ్యవాణి డిమాండ్ చేశారు. పేకాట కేంద్రాలు, ఇతరఅవినీతి వ్యవహారాలకు సంబంధించిన లావాదేవీ వ్యవహారాల్లో తేడాలు రావడంవల్లే, ఉండవల్లి శ్రీదేవి తనకు ప్రాణహానీ ఉందంటూ కొత్తడ్రామాలు మొదలుపెట్టిందన్నారు.
శ్రీదేవి వ్యవహారశైలి చూసి ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని, ఎమ్మెల్యేలే ఇలా డబ్బుకోసం చేయరాని పనులు చేయడం, జగన్మోహన్ రెడ్డి దిగజారుడు పాలనకు నిదర్శనమని అన్నారు.. అధికారం ఉందికదా అని పేకాట కేంద్రాలు నడపడం, మద్యం అమ్మకాలు సాగించడం సరికాదన్నారు. చూడబోతే, ఈప్రభుత్వం సచివాలయాన్ని కూడా భవిష్యత్ లో పేకాట కేంద్రంగా మారుస్తుందేమోననే సందేహం రాష్ట్రవాసుల్లో కూడా ఉందని టీడీపీ మహిళా నేత అభిప్రాయపడ్డారు.