ఎల్ఐసీ పాలసీ ప్రీమియం కట్టలేదా? తగ్గింపు పొందండిలా

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 06:14 PM
 

మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాలసీ ప్రీమియం చెల్లించలేకపోయారా? మీలాంటివారికి శుభవార్త చెప్పింది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- ఎల్ఐసీ. స్పెషల్ రివైవల్ క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఆగస్ట్ 10 నుంచి అక్టోబర్ 9 వరకు అంటే రెండు నెలలు స్పెషల్ రివైవల్ క్యాంపైన్‌ కొనసాగుతుంది. పలు కారణాల వల్ల ప్రీమియం చెల్లించనివారు, పాలసీలు ల్యాప్స్ అయినవారు తమ పాలసీలను రెన్యువల్ చేయించుకోవచ్చు. ప్రీమియం చెల్లించడం ఆపేస్తే రిస్క్ కవర్ ఆగిపోతుంది. అందుకే పాలసీహోల్డర్లు రిస్క్ కవర్ కొనసాగించుకోవడానికి వీలుగా తరచూ స్పెషల్ రివైవల్ క్యాంపైన్‌‌ను నిర్వహిస్తూ ఉంటుంది ఎల్ఐసీ. ఇప్పుడు మరోసారి ఈ క్యాంపైన్ ప్రారంభించింది. పాలసీ ల్యాప్స్ అయినట్టైతే అక్టోబర్ 9 వరకు రెన్యువల్ చేయించుకోవచ్చు. పాలసీ ప్రీమియం చెల్లించడం ఆపేసిననాటి నుంచి ఐదేళ్లలలో పాలసీ రివైవ్ చేయొచ్చు. ఇది కూడా ఎంపిక చేసిన పాలసీలకు నియమనిబంధనలకు అనుగుణంగా రివైవల్ ఉంటుంది.ఎల్ఐసీలో 88, 89, 94, 104, 105, 111, 133, 150, 153, 164, 165, 177, 190, 805, 806, 822, 823, 825, 854, 855 ప్లాన్స్‌తో పాటు మైక్రో ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ లాంటి పాలసీలకు రివైవల్ వర్తించదు. ఎల్ఐసీ సూచించిన పాలసీలను మాత్రమే రెన్యువల్ చేసుకోవచ్చు. పాలసీహోల్డర్లు ప్రీమియంతో పాటు లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎయితే ఎల్ఐసీ లేట్ ఫీజులో కన్సెషన్ ఇస్తోంది. ప్రీమియం రూ.1,00,000 లోపు ఉంటే లేట్ ఫీజులో 20% గరిష్టంగా రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. రూ.1,00,001 నుంచి రూ.3,00,000 ప్రీమియం ఉంటే ఆలస్య రుసుములో 25% గరిష్టంగా రూ.2,000 వరకు, ప్రీమియం రూ.3,00,001 పైన ఉంటే లేట్ ఫీజులో 30% గరిష్టంగా రూ.2,500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఒకవేళ మీరు మీ పాలసీని రివైవ్ చేయాలనుకుంటే దగ్గర్లోని ఎల్ఐసీ ఆఫీసులో సంప్రదించొచ్చు. మీ పాలసీని రెన్యువల్ చేయిస్తే గతంలో పాలసీపై ఉన్న బెనిఫిట్స్ ఎప్పట్లాగే పొందొచ్చు. రిస్క్ కవర్ కూడా కొనసాగుతుంది. బోనస్‌, ఇతర బకాయిలు క్రెడిట్ అవుతాయి.