ఈ స్కీమ్‌లో నెలకు రూ.3,000 పెన్షన్..అప్లై చేయండిలా

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 06:11 PM
 

ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్-ధన్ పెన్షన్ స్కీమ్‌ను కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరినవారికి 60 ఏళ్ల తర్వాత జీవితాంతం నెలకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం రూపొందించిన పెన్షన్ స్కీమ్ ఇది. ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్-ధన్ పెన్షన్ స్కీమ్‌లో చేరినవాళ్లు 60 ఏళ్ల వరకు నెలకు కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. అంతే మొత్తం ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో పనిచేసేవారికోసం ఉన్న ఈపీఎఫ్ స్కీమ్ లాంటిదే ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్-ధన్ పథకం. ఈ పథకం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 18 నుంచి 40 ఏళ్ల వయస్సు వారికి. వారి జీతం రూ.15,000 లోపు ఉండాలి. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ ఉండాలి.వీధుల్లో దుకాణాలు నిర్వహించేవాళ్లు, ఇళ్లల్లో పనిచేసేవాళ్లు, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసేవాళ్లు, రిక్షా పుల్లర్లు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు... ఇలా అసంఘటిత రంగంలో పనిచేసేవాళ్లు ఎవరైనా ఈ పథకంలో చేరొచ్చు. ఈ స్కీమ్‌లో 8 శాతం వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ఎంచుకున్న వాళ్లు వారి వయస్సును బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. అంతే మొత్తం ప్రభుత్వం తరఫున జమ అవుతుంది. ఈ పథకం ఎంచుకున్నవారికి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. లబ్ధిదారులు చనిపోతే వారి జీవితభాగస్వామికి జీవితాంతం సగం పెన్షన్ లభిస్తుంది. ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్-ధన్ పథకం చేరాలంటే బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఎల్ఐసీ, ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ ఆఫీసులతో పాటు కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయాల్లో ఈ పథకంలో చేరొచ్చు.