కొబ్బరిచెట్టుపైన మంత్రి మీడియా సమావేశం

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 06:06 PM
 

రాజకీయ నేతలు, మంత్రులు మీడియా సమావేశాలను భవంతులు, ఆడిటోరియంలో ఏర్పాటుచేయడం సర్వసాధారణం. కానీ, దీనికి భిన్నంగా ఓ మంత్రిగారు ఏకంగా కొబ్బరి చెట్టు ఎక్కి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడమే కాదు, కాయలు కోయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన శ్రీలంకలో చోటుచేసుకుంది. కొబ్బరికాయలు కొరత, ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మంత్రి అరుండికా ఫెర్నాండో ఈ పంథాను ఎంచుకున్నారు. కొబ్బరి, పిష్‌టైల్ పామ్, రబ్బర్ ఉత్పత్తుల శాఖ సహాయ మంత్రి అరుండికా ఫెర్నాండో డాంకోటువాలోని తన కొబ్బరి ఎస్టేట్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఓ కొబ్బరి చెట్టుపైకి ఎక్కిన ఆయన అక్కడి నుంచే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి అరుడింకా మాట్లాడుతూ కొబ్బరి ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో కొబ్బరికాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని అన్నారు. కొబ్బరి కాయలు కోసే కూలీలకు ఒక్కొ చెట్టుకు రూ.100 చొప్పున చెల్లించాలని తెలిపారు. కొబ్బరికాయలు కోయడం, ఉత్పత్తికి సంబంధించి ఉపాధి దొరకడం నానాటికీ కష్టంగా మారిందన్నారు. ధరలు పెరుగుతున్నా కొబ్బరికాయలు దిగుమతి చేయబోమని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక పరిశ్రమల నుంచి అధిక డిమాండ్, దేశీయ అవసరాల కారణంగా 700 మిలియన్ల కొబ్బరికాయలు కొరత ఉందన్నారు.