ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడగడుగునా చిన్నచూపు, వివక్షత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 17, 2020, 03:24 PM

ఆర్థికంగా బలపడితేనే మహిళలకు భద్రత


దేశంలో మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య వివక్షత, చిన్నచూపు. కళ్ల ముందే ఉన్నా కనిపించని సమస్య ఈ మహిళా వివక్షత. ఎంత వయస్సు వచ్చినా.. నీకేం తెలియదు అనే తల్లిదండ్రులు, ఎంత పని చేసినా కూర్చుని తినడమే కదా నీ పని అనే భర్త. పేదరికానికి బలైపోయే చిన్నారి పెళ్లికూతుళ్లు. కట్నం ఇవ్వనిదే జరగని పెళ్లిళ్లు, శ్రమకు తగ్గట్టుగా దక్కని వేతనాలు, కడుపులోనే కరిగిపోయే.. పసి పిండాలు. ఆడవాళ్లు ఎదుర్కొనే ఈ గండాలను ఎవరు చూడారు. చూసినా ప్రశ్నించరు. వీటిని సొసైటీ మౌనంగా ఆమోదిస్తూ ఉంటుంది.ఇప్పటికీ కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయించేస్తారు. అమ్మాయికి పదో తరగతి వరకూ చదువు చాలంటూ ఆపేస్తారు. ఎవరో ఒకరికి ఇచ్చిపెళ్లి చేసేసి పంపించేయాలనే బరువుగానే చూస్తారు. ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన ఈ సమయంలో కూడా ఆడవాళ్లకు ఈ అగచాట్లు తప్పడం లేదు.పైగా దేశంలో మహిళలకు ఏ మాత్రం భద్రత లేదు. అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోయాయి. ఇంటా, బయటా ఎక్కడ సెక్యూరిటీ లేదు. ఆఫీసుల్లో వేధింపులు, ఇంట్లో సాధింపులు. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో మన దేశం తొలి స్థానంలో ఉన్నట్టు రాయిటర్స్ ఫౌండేషన్ జరిపిన సర్వేల్లో తేలింది. దీని బట్టి మహిళలు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరకట్నం చావులు, ఇంట్లో భర్త వేధింపులు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆడవాళ్లు భార్యగా, తల్లీగా, కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే బయట కూడా ఉద్యోగం చేసి ఆర్థిక భరోసాను అందిస్తున్నారు. అయినా మహిళలకు దక్కాల్సిన గౌరవం ఈ దేశంలో దక్కడం లేదనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.మహిళలకు మగవాళ్లకున్నట్టే లక్ష్యాలుంటాయి. ఆశలుంటాయి. శరీరంలో వచ్చే మార్పులతో ఉద్వేగాలుంటాయి. కానీ వాటిని ఎవరూ పట్టించుకోరు. ముఖ్యంగా టీనేజ్‌‌లో అమ్మాయిల శరీరాల్లో రకరకాల మార్పులు జరుగుతాయి. ఆ టైంలో అన్ని అద్భుతంగానే కనిపిస్తాయి. ఆ సమయంలో అమ్మాయిలకు తల్లీదండ్రుల ఆలంబన, ప్రేమ చాలా అవసరం. అప్పుడే ఎవరితో ఎలా మెలగాలో చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. టీనేజ్‌లో ఎక్కువగా అమ్మాయిలు రకరకాల మనుషులకు అట్రాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కొంతమంది దుర్మార్గులు కచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇంటికొచ్చే పెద్ద మనుషులే మిస్ బిహేవ్ చేస్తారు. దానిపట్ల అమ్మాయిలు ఎలా స్పందించాలో తెలియక మనస్సులో దాచుకుంటారు.టీనేజ్‌లో అమ్మాయిలు కాలేజీల్లో అబ్బాయిలతో స్నేహం శృతిమించి అనవసర సమస్యల్లో చిక్కుకుంటున్నారు. టీనేజ్‌లోనే ప్రేమ వ్యవహారాల్లో పడి బాధలు కొనితెచ్చుకుంటున్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అందుకే టీనేజ్‌లో అమ్మాయిలకు ఇలాంటి విషయాల పట్ల అవగాహన పెంచాలి. దానికోసం ఇంట్లో తల్లిదండ్రులు, స్నేహితులు, టీచర్లు కృషి చేయాలి. వీలైనంత వరకూ ఓపెన్‌గా ఉండి అన్ని డిస్కస్ చేసే విధంగా అమ్మాయిలను ఎడ్యుకేట్ చేయాలి.మహిళలు అభివృద్ధి సాధించాలంటే ఆర్థికంగా బలపడాలి. డబ్బుల కోసం ఎవరిమీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండకూడదు. ఇలా జరగాలంటే వారికి ఉపాధిఅవకాశాలు పెరగాలి. చాలామంది మహిళలు ఎక్కడో దూరంగా ఉండే ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయలేక డ్రాప్ అవుతున్నారు. కొంతమంది కొన్నాళ్లు చేసి మానేస్తున్నారు. దీనికోసం మహిళలు ఉన్నచోటే సంపాదించుకునే మార్గాలను పెంచాలి. దానికోసం ప్రభుత్వం కొంత కృషి చేయాలి. మహిళలు చిన్న తరహా, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించాలి. స్థానికంగా ఉండే పరిశ్రమల్లో మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. వారి అర్హతలకు తగ్గట్టుగా జాబ్స్ ఇవ్వాలి. వర్క్‌షాపులను ఏర్పాటు చేసి మహిళలకు శిక్షణలు ఇవ్వాలి. మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేలా పెద్ద పెద్ద పరిశ్రమలు సైతం ముందుకు రావాలి. మహిళలు తాము చేయగలిగే పనులతో ముందుకు వెళ్లేలా అవగాహన పెంచాలి.మహిళలు ఆర్థికంగా బలపడితే సమాజంలో వారి పట్ల చూసే చూపు కూడా మారుతుంది. అలాగే మహిళలను ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకురావడమే కాదు.. వాటిని కచ్చితంగా అమలు చేయాలి. అంతేకాదు ఆడవాళ్లు ఎదుర్కొనే సమస్యలపై మగవాళ్లకు కూడా అవగాహన పెంచాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa