ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొలువులపై కరోనా ఎఫెక్ట్.. వచ్చే ఏడాదిలోనే ఇక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 10, 2020, 05:58 PM

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో నిరుద్యోగం పెరిగింది. దేశంలో చాలామంది రోడ్డున పడ్డారు. నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సైతం చాలామంది తమ ఉపాధిని కోల్పోయారు. తినడానికి తిండి లేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో పెద్ద పెద్ద కంపెనీలు సైతం సిబ్బందిని తగ్గించుకున్నాయి. అవసరం ఉన్నంత వరకూ ఉంచుకుని .. మిగతా వారిని తీసేశాయి. అయితే ఈ ప్రభావం మరికొన్నాళ్లు ఉంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కొవిడ్ కల్లోలంతో దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగే అవకాశాలున్నాయని అంటున్నాయి.కొవిడ్ కారణంగా దేశంలో నిరుద్యోగం పెరిగి ఆర్థిక అసమానతలు పెరుగుతాయని ఇండియన్ సొసైటీ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ (ISLE) సర్వే తెలిపింది.


మే చివరి వారంలో 520 మంది ISLE సభ్యులపై ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. కరోనా కారణంగా తక్షణమే అనేక మంది ఉద్యోగాలు కోల్పోవడం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని ఈ సర్వేలో తేలింది. పట్టణ ఆర్థిక వ్యవస్థలో 80 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యాయని అంచనా వేసింది. వీటిలో ఎక్కువ భాగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని స్వయం ఉపాధి విభాగంలో 54 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యాయి.ఇలా ఉపాధి కోల్పోయిన కార్మికులకు, వారి కుటుంబాలకు తక్షణమే ఆర్థిక భరోసాను, అవసరమైన డబ్బులను ఇవ్వాలని, రక్షణ అందించాలని, చిన్న ఉపాధి అవకాశాలను కల్పించాలని సూచించింది. అలాగే ప్రజా సంరక్షణకు దీర్ఘకాలిక వ్యూహం కూడా ఉండాలని అభిప్రాయపడింది. దీనికోసం బలమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థ అవసరమని, అలాగే వలస కూలీల సామాజిక భద్రత, వారి హక్కుల కోసం కొత్త విధానాలను రూపొందించాలని సూచించింది.కరోనా దెబ్బకు పెద్ద కంపెనీలు సైతం కుదేలైపోయాయి. లాక్‌డౌన్ ప్రభావంతో చితికిపోయిన చాలా కంపెనీలు నార్మల్ పరిస్థితికి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పట్లో ఈ కంపెనీలు కొత్త ఉద్యోగాలను భర్తీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. జనవరి 2021 తర్వాత ఉద్యోగ నియామకాలు చురుకుగా ఉంటాయని 50 శాతం కంపెనీ యజమానులు భావిస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. దేశంలో ఉద్యోగ కల్పిత దృక్పథం: నియామకాలపై కోవిడ్ -19 ప్రభావం అనే అంశంపై కెరీర్‌నెట్ టెక్నాలజీస్ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా ఉద్యోగాల నియామకాలపై చాలా కంపెనీలు ఆసక్తి చూపడం లేదని స్పష్టం అయింది. అదే సమయంలో ముందు ముందు వర్చవల్ నియామకాలకే కంపెనీలు మొగ్గు చూపుతున్నట్టు తేలింది.


 


కరోనా చాలా పద్ధతులను మార్చేసింది. అలాగే జాబ్స్ ప్రక్రియలోనూ మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు కంపెనీలు ఆఫీసులకు వచ్చి పనులు చేసే ఉద్యోగుల కంటే వర్చువల్‌గా పనులు నిర్వహించే ఉద్యోగులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్, ఐటీ, ఐటీఈఎస్, సర్వీసెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ రంగాలకు చెందిన కంపెనీలు వర్చువల్‌గా ఉద్యోగులను నియమించుకోవడానికి ఇష్టపడుతున్నాయి. హైరింగ్ అవుట్ లుక్ ఇన్ ఇండియా పేరుతో కెరీర్ నెట్ కన్సల్టింగ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. నాలుగు సంస్థల్లో మూడు సంస్థలు రిమోట్‌గా ఉద్యోగులను నియమించగలవని ఈ సర్వే తెలిపింది.


రాబోయే మూడు నెలల్లో సగానికి పైగా కంపెనీలు రిమోట్ హైరింగ్‌‌లనే చేపట్టనున్నట్టు తెలుస్తుంది. దీనికోసం కంపెనీలు ప్రణాళికలు కూడా వేసుకున్నట్టు సర్వేలో తేలింది.


 


అదే విధంగా ఉద్యోగ నియామకాలు ఈ ఏడాది జరిగే అవకాశాలు లేవని సర్వేలో తెలిసింది. జనవరి 2021 తర్వాత నియామకాలు జరగనున్నట్టు సర్వేలో చాలామంది అభిప్రాయపడ్డారు. 2021లోనే ఉద్యోగ నియిమాకాలు జోరందుకుంటాయని సర్వే తేల్చింది. సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 43 శాతం కంపెనీలు వచ్చే ఏడాది జనవరిలో నియామకాలకు వెళ్తామని వెల్లడించాయని కెరీర్ నెట్ పేర్కొంది. అలాగే క్యాంపస్ నియామకాలు కొంతమేర తగ్గే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది క్యాంపస్ రిక్రూంట్‌మెంట్‌కు వెళ్లే ఆలోచన లేదని 36 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ఇక ముందు కాలమంతా అభ్యర్థులను ఫ్రీలాన్స్‌గా నియమించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సర్వేల్లో తేలింది. ఇక కంపెనీలు డిజిటల్ విధానంపై ఎక్కువ దృష్టి పెట్టనున్నాయి. అలాగే వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు నిర్వహించడం ఇక సాధ్యం కానందున అసెస్‌మెంట్, వీడియో ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక చేసేందుకు కంపెనీలు రెడీ అవుతున్నట్టు సర్వేల్లో తేలింది.


 


కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ అవుట్‌లుక్ సర్వే ప్రకారం భారత దేశంలో దేశీయంగా నియామకాలు 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయాయని వెల్లడైంది. ఈ సంక్షోభం మరికొన్ని నెలలు కొనసాగుతుందని సర్వే చెప్పింది. కేవలం 3 శాతం కంపెనీలు మాత్రమే వచ్చే మూడు నెలల్లో నియామకాలకు ప్లాన్ చేస్తున్నట్టు 800 సంస్థల యాజమాన్యాలు తెలిపాయి. , ఈ ఏడాది చివరి త్రైమాసికంలో నియామకాల విషయమై దేశ వ్యాప్తంగా 813 సంస్థలు పాల్గొన్నాయి. సర్వే ప్రకారం, మధ్య తరహా సంస్థలు కొంత పెరుగుతాయని, పెద్ద సంస్థల్లో తక్కువ ఉద్యోగాలు ఉంటాయని చాలామంది భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa