భారత్‌లో ద్విచక్రవాహనదారులు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలకు అలవాటు పడుతున్నారు. దీంతో ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు) స్టార్టప్‌లతో పాటు బజాజ్, టీవీఎస్ వంటి పెద్ద కంపెనీలు వీటి తయారీకి ఆసక్తి చూపుతున్నాయి. తక్కువ ధరల్లో లభిస్తుండటం, నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉండటంతో వీటిని కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మన దేశంలో ఇప్పటి వరకు విడుదలైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.
1. బజాజ్ చేతక్ ఈవీ:
ఈ జాబితాలో ముందు వరుసలో ఉండేది బజాజ్ చేతక్. గతంలో ఈ సంస్థ నుంచి వచ్చిన చేతక్ స్కూటర్ అప్పట్లో ఓ సంచలనం. ఆ చేతక్ బ్రాండ్‌ని ప్రతిబింబించేలా బజాజ్ తన మొదటి ఎలక్ట్రిక్ వాహనానికి మళ్లీ ఆ పేరునే పెట్టింది. మెటల్ బాడీతో తయారైన ఈ స్కూటర్‌ను నియో రెట్రో డిజైన్‌లో తీర్చిదిద్దారు. దీని ఎలక్ట్రిక్ మోటారు 5.36 బిహెచ్‌పి లేదా నాలుగు కిలోవాట్ల శక్తిని, 16 ఎన్‌ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఎకో, స్పోర్ట్ రైడ్ మోడ్‌లు దీని సొంతం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే... ఎకో మోడ్‌లో గరిష్ఠంగా 95కి.మీ, స్పోర్ట్ మోడ్‌లో 85కి.మీ వరకు ప్రయాణించొచ్చు. దీని బరువు 120కిలోల వరకు ఉంటుంది. గరిష్ఠ వేగం 60కి.మీ. ప్రీమియం పెయింట్ ఫినిషింగ్, అల్లాయ్ వీల్స్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, కీలెస్ ఇగ్నిషన్, ఎల్‌ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంటుందీ బైక్. డ్రమ్ బ్రేక్‌లతో కూడిన చేతక్ అర్బన్ ఎడిషన్ ధర రూ.1లక్ష. డిస్క్ బ్రేక్‌లతో కూడిన చేతక్ ప్రీమియం ఎడిషన్ ధర రూ.1.15 లక్షలు.
2. టీవీఎస్ ఐక్యూబ్ :
బజాజ్ చేతక్ తరువాత టీవీఎస్ కూడా ఈవీ రంగంలోకి దిగి ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది మంచి ఫిట్, ఫినిషింగ్ కలిగి చూడటానికి సాధారణ స్కూటర్ లాగా ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 78కి.మీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75కి.మీ. వరకు ప్రయాణించొచ్చు. స్టాండర్డ్5 ఆంపియర్ ఛార్జర్తో దీన్ని ఆరు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ మోటారు 5.9 బిహెచ్‌పి లేదా 4.4 కిలోవాట్, 140 ఎన్‌ఎమ్‌ల సామర్థ్యంతో ఉంటుంది. కేవలం నాలుగు సెకన్లలోనే నలభై కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు. స్కూటర్‌లో ఎకానమీ, పవర్ రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. బ్లూటూత్ ఎనేబుల్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ దీని సొంతం. టీవీఎస్ కు చెందిన స్మార్ట్ ఎక్సోనెక్ట్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. జియో-ఫెన్సింగ్, నావిగేషన్, ఓవర్-స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లతో ఉన్న ఈ స్కూటర్ ధర రూ.1.15 లక్షలు. ఇది కేవలం ఒక వేరియంట్లోనే లభిస్తుంది.
3. అథెర్ 450 ఎక్స్ :
ఇది బ్లూ ఎలక్ట్రిక్ స్కూటర్. దీన్ని అథెర్ ఎనర్జీ అనే సంస్థ తయారు చేస్తుంది. అథర్ 450, 450 ఎక్స్ బైక్‌లు స్టైలిష్ గా ఉంటాయి. అథెర్ 450 మోడల్‌లో 2.71కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ, బీఎల్‌డీసీ మోటార్ ఉంటాయి. 5.4కేడబ్ల్యూ లేదా 7.24 బీహెచ్‌పి గరిష్ట శక్తి, 20.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ దీని సొంతం. అథెర్ 450 కేవలం 3.9 సెకన్లలో 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మ్యాగ్జిమమ్ స్పీడ్ గంటకు 80 కిలోమీటరు. ఎకానమీ మోడ్‌లో ఉన్న అథెర్ 450ను ఒకసారి ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. పవర్ మోడ్ లో ఒకసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. దీని ధర రూ.1.25 లక్షలు. ఇది ఆన్-రోడ్ ధర. కొత్త అథెర్ 450 ఎక్స్ ఇప్పటికే 450 మోడల్‌కు అప్‌డేటెడ్ వర్షన్.
4. రివోల్ట్ ఆర్ వి :
జాబితాలో ఉన్న ఏకైక మోటార్‌సైకిల్ రివోల్ట్ ఆర్‌వి 400. ఇది పనితీరు-ఆధారిత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మోడల్. గరిష్ట వేగం 85 కిలోమీటర్లు. దీని లిథియం-అయాన్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 156 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. స్థిరంగా 65కి.మీ వేగాన్నిమించకుండా నడిపితే ఈ టార్గెట్ సాధ్యమవుతుంది. 3కేవీ ఎలక్ట్రిక్ మోటార్, 170 ఎన్ఎమ్ టార్క్, 3.24 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ దీని సొంతం. రివాల్ట్ బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది. ఆర్‌వీ 400 ను 36 నెలలకు రూ.3,499 నెలవారీ చెల్లింపులతో కొనొచ్చు. 4జీ కనెక్టివిటీకి అదనంగా రూ.5,000 ఖర్చవుతుంది. ధర రూ.1.34 లక్షలు.
5. ఒకినావా ప్రైజ్‌ప్రో :
ఇది మన దేశంలో ప్రైజ్, ఐ-ప్రైజ్ స్లాట్లలో లభిస్తుంది. ప్రైజ్‌ప్రో 1,000 వాట్ల బ్రష్‌లెస్ డిసి (బిఎల్‌డిసి) వాటర్‌ప్రూఫ్ మోటారుతో లభిస్తుంది. 2.5 కిలోవాట్ల శక్తి, 40 ఎన్‌ఎమ్ సామర్థ్యం, 2 కేడబ్ల్యూ లిథియం-అయాన్ బ్యాటరీ దీని సొంతం. స్పోర్ట్ మోడ్‌లో 88 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఎకానమీ మోడ్‌లో 110 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఎకానమీ మోడ్‌లో వేగం 35 కి.మీ. మాత్రమే. స్పోర్ట్స్ మోడ్‌లో ఇది 65-70 కి.మీ. ఒకినావా ప్రైజ్ ప్రో ధర రూ.71,990.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa