మోసానికి కాదేది అనర్హం అన్నట్లు ఆ యువతి సరికొత్త ప్లాన్ వేసింది. ముసలోళ్లను టార్గెట్ గా చేసుకుంది. తన అందచందాలతో వాళ్లని మైమరపించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత ఒకరోజు డబ్బు నగలతో ఉడాయించడం ఇదే అలవాటుగా చేసుకుంది. ఇలా ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు అనేక మందిని ముంచేసింది. అలా సివిల్ కాంట్రాక్టర్ ను మోసం చేసి పెళ్లి చేసుకుని అలా బురిడీ కొట్టించి అడ్డంగా దొరికిపోయింది. ఈ కిలాడీ లేడీ యూపీలోని ఘజియాబాద్‌లో పట్టుబడింది.వివరాల్లోకి వెళ్తే నగరంలోని కవి నగర్‌లో నివాసముంటున్న సివిల్ కాంట్రాక్టర్ జుగల్ కిషోర్(66) భార్య ఏడాది కిందట మరణించింది. అతని ఒక్కగానొక్క కొడుకు ఎక్కడో దూరంగా స్థిరపడ్డాడు. ఒంటరితనంతో బాధపడుతున్న కిషోర్ దినపత్రికలో రెండో పెళ్లి గురించి ఒక ప్రకటన వేయించాలనుకున్నాడు. మ్యాట్రిమొనియల్ ఏజెన్సీకి ఫోన్ చేశాడు. ఖన్నా వివాహ కేంద్ర నిర్వాహకురాలు మంజు ఖన్నా లైన్‌లోకి వచ్చారు. కిషోర్ వివరాలు తెలుసుకున్న మంజు అతనికి సరిపోయే కరెక్ట్ సంబంధం ఒకటి ఉందంటూ మోనికాని పరిచయం చేసింది.మోనికా అతని కంటే 25 ఏళ్లు చిన్నది కావడం గమనార్హం. ఇద్దరూ కలుసుకోవడంతో తొలిచూపులోనే మోనికా కిషోర్‌కి నచ్చింది. తన భర్త నుంచి విడాకులు తీసుకున్నానని.. పక్కా జెంటిల్మెన్‌ని రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పడంతో కిషోర్ సంబరపడిపోయాడు. ఇద్దరి అభిరుచులు కలవడంతో పెళ్లి కూడా అయిపోయింది. వివాహానంతరం కవి నగర్‌లోని ఇంట్లో కాపురం పెట్టారు. రెండునెలులు గడచిపోయాయి. జీవితం సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో కిషోర్‌కి ఊహించని షాక్ తగిలింది. ఓ రోజు ఉదయం సడెన్‌గా భార్య మోనికా కనిపించకుండా పోయింది.ఇంట్లో పెట్టిన బంగారు నగలు, నగదు కనిపించకుండా పోయాయి. సుమారు రూ.15 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురైంది. అనుమానం వచ్చిన కిషోర్ ఇంటి సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి కంగుతిన్నాడు. పెద్ద బ్యాగుతో పొద్దున్నే పారిపోతున్న భార్యని చూసి షాక్‌కి గురయ్యాడు. డబ్బు, నగలతో భార్య పారిపోయిందని గ్రహించి వెంటనే వివాహం కుదిర్చిన ఏజెన్సీకి ఫోన్ చేయడంతో బెదిరింపులు ఎదురయ్యాయి.తప్పుడు కేసులో ఇరికిస్తామని తమకు రూ.20 లక్షలు చెల్లించాలంటూ బెదిరింపులకు దిగడంతో కిషోర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టడంతో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మోనికా ఇప్పటి వరకు 8 మంది సీనియర్ సిటిజన్స్‌ని పెళ్లి చేసుకుందని విచారణలో తేలింది. అవన్నీ ఖన్నా ఏజెన్సీ ద్వారానే జరిగినట్లు గుర్తించారు. నిత్యపెళ్లికూతురు మోనికా, అతని కుటుంబ సభ్యులు, ఏజెన్సీ నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని జైలుకు పంపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa