ట్రెండింగ్
Epaper    English    தமிழ்

26 వారాల పాటు సెలవులతో ప్రసవం సమయంలో వెసులుబాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 27, 2020, 07:49 PM

ప్రసవం అనేది మహిళలకు పునర్జన్మలాంటిది. ఇప్పటికీ మన దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రసవ వేదనలో తల్లీ, బిడ్డలు చనిపోతున్న ఘటనలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్న ఈ కాలంలో కూడా ఇలాంటి మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక ప్రసవం తర్వాత కూడా తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అదే సమయంలో వాళ్లు తమ బిడ్డలను చూసుకోవాల్సి ఉంటుంది. బిడ్డ పోషణాపరమైన జాగ్రత్తలను తీసుకోవాలి. దీని కోసం ఈ సమయాల్లో ఆఫీసుల్లో పనిచేసే మహిళలు కచ్చితంగా సెలవులు తీసుకోవాలి. కానీ వీరు చేసే ఉద్యోగం వీరి ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేలా చేస్తుంది. కుటుంబం, ఉద్యోగం మధ్య అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న మహిళలు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు ప్రసూతి సెలవులతో పాటుగా పిల్లల సంరక్షణా ప్యాకేజీలను కూడా బోనస్‌గా అందిస్తుంటాయి.అప్పుడే పుట్టిన బిడ్డతో కచ్చితంగా తల్లి ఉండాలి. ఆ టైంలో తల్లిపాలతోనే బిడ్డ ఆకలి తీరుతుంది. తల్లీ బిడ్డల మధ్య ఉండే సాన్నిహిత్యంతో వారి బంధం మరింత పెరగడమే కాదు.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగానూ ఉంటారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ సమయంలో మహిళలకు కచ్చితంగా ప్రసూతి సెలవులు అవసరం. 40 శాతం మహిళా శ్రామికశక్తిని కలిగి ఉన్న ఈ ప్రపంచంలో ఉత్తమ ప్రసూతి సెలవు విధానాలను అందివ్వడం తల్లులకు మద్దతునివ్వడంలోను, క్రమంగా వారికి పిల్లలపట్ల శ్రద్ధ వహించేలా చేయడంలోనూ సహాయపడతాయి.యునిసెఫ్ ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లల మొదటి సంవత్సరాలలో తల్లిదండ్రులు తీసుకునే సెలవులు చాలా ముఖ్యమైనవి, అవి వారి జ్ఞాపకశక్తి అభివృద్ధికి, భవిష్యత్తుకు సహాయపడతాయి. తల్లిదండ్రులకు కనీసం ఆరు నెలల కనీస సెలవులను మంజూరు చేయాలని, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, సౌకర్యాలను అందించేలా తోడ్పాటునివ్వాలని యునిసెఫ్ సూచించింది. అయినప్పటికీ మహిళలకు ఇచ్చే ప్రసూతి సెలవులు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయి. మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ ప్రయోజనాలు కొంతమేర ఎక్కువేనని చెప్పవచ్చు.మహిళలకు మంచి పిల్లల సంరక్షణ, ప్రసూతి ప్రయోజనాలను అందించే దేశాల వరసలో భారతదేశం కూడా చేరింది. మహిళలు 26 వారాల పాటు పూర్తి శాలరీ చెల్లింపుతో ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. 50 మందికి పైగా ఉద్యోగులతో కూడిన సంస్థలకు కూడా ఈ నిబంధనలు తప్పనిసరి. 26 వారాల ప్రసూతి సెలవులను అందిస్తూ చైనా, పాకిస్తాన్, సింగపూర్, జర్మనీ మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల కంటే భారతదేశం ముందు వరుసలో ఉంది. కొన్ని పరిధులతో, పరిమితులతో కూడిన శాలరీ పొందేలా, ప్రసూతి సెలవులను విస్తరించుకునే సౌలభ్యం కూడా భారతదేశంలో ఉంది. ఆయా సంస్థ ప్రతినిధులద్వారా, సరైన వివరణను ఇవ్వడం ద్వారా వీటిని క్లెయిమ్ చేసుకోవచ్చు.స్వీడన్ కుటుంబాల పరంగా అంత్యంత స్నేహ పూర్వక ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ దేశం మహిళ గర్భవతి అయినప్పటి నుంచి ప్రయోజనాలను అందిస్తూ ఉంటుంది. పిల్లల ఎదుగుదలతోపాటు, జెండర్ ఈక్వల్ వాతావరణాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం 480 రోజుల పాటు తల్లిదండ్రులు ఇద్దరికి ప్రసూతి సెలవులను అందిస్తుంది. పిల్లల సంరక్షణ కోసం పనిగంటలను 25 శాతం తగ్గించుకునే వెసులుబాటు కూడా ఉంది.ఉద్యోగంతోపాటు, జీవిత సమతుల్యతలను కాపాడుకోవలసిన అవసరాన్ని ప్రోత్సహించేలా నార్వే చట్టాలు ఉంటాయి. ఇక్కడ ఉద్యోగాన్ని బట్టి 49 నుంచి 50 వారాలపాటు తల్లులకు పూర్తి శాలరీలతో ప్రసూతి సెలవులను అందిస్తారు. పిల్లల భద్రతాపరంగా అత్యంత కఠిన నిర్ణయాలను తీసుకునే దేశాలలో నార్వే ఒకటి. నార్వేలో పిల్లలకు స్కూల్‌కు వెళ్లడం లేదని తల్లిదండ్రులు తిట్టినా లేదా కొట్టినా వారు జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే.క్రొయేషియా మహిళా ఉద్యోగులకు, గర్భిణీలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది. మహిళలకు ఒక సంవత్సరంపాటు పూర్తి శాలరీతో పాటు ప్రసూతి సెలవులను అందిస్తుంది. ప్రసవానంతర ఉచితంగా వైద్య సంరక్షణా ప్రయోజనాలను అందివ్వడమే కాకుండా పనిచేసేటప్పుడు తల్లి పాలివ్వడానికి పని మధ్యలో బ్రేక్స్ ఇచ్చే వెసులుబాటు ఉంటుంది.ఇంగ్లాండ్‌లో జీతాల స్వల్ప తగ్గింపుతో మహిళలు 39 వారాల ప్రసూతి సెలవులను తీసుకునేలా అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు గర్భిణీలు నిర్ణీత తేదీకి 11 వారాల ముందుగానే ఈ సెలవులను తీసుకోవచ్చు. శిశువు చెప్పిన కాలం కన్నా ముందుగా జన్మించిన పక్షంలో కొన్ని రూల్స్ అదనంగా చేర్చబడుతాయి. కొన్ని నమోదు చేయబడిన ఆసుపత్రులలో ఉచిత ప్రసవ, ప్రసవానంతర సంరక్షణ పొందటానికి మహిళలకు అనుమతి ఉంది.మహిళలకు ప్రసూతి సెలవులు చాలా అవసరం. చాలా మంది మహిళా ఉద్యోగులు మన దేశంలో ఉన్నారు. అయితే ఇలా సెలవులను అప్లై చేసుకోవచ్చని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa