ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోరుచిక్కుడు సాగులో మెళకువలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 21, 2020, 05:33 PM

మన రాష్ట్రంలో సాగుచేసే పంటలలో గోరుచిక్కుడు ఒకటి. దీనిని ప్రధాన పంటగా వేసుకోవచ్చు. అలాగే అంతర పంటగా కూడా సాగుచేసుకొనే వీలుంది. ఇది కూరగాయగా కాకుండా పచ్చిరొట్ట పంటగా కూడా సాగుచేసుకోవచ్చు. ఇందులో ప్రధానంగా కాయలలో 22 శాతం ప్రోటీన్ ఉంటుంది. దీనితో పాటు పీచు, కాలియం, ఫాస్ఫరస్, ఇనుము విటమిన్ ఎ, బి, సిలు మొదలగునవి ప్రధాన పోషకాలు. గింజలలో గలాక్టోయన్నాన్ అనే జిగురు ఉంటుంది. ఈ జిగురును మందులు, సౌందర్య పోషకాలు, పేపర్ తయారీ, బట్టలు, నూనెల తయారీ, పేలుడు పదార్ధాల తయారీలో ఉపయోగిస్తారు. మొక్కను పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగిస్తారు. అధిక ఉష్ణోగ్రత, తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితుల్లో కూడా దిగుబడిని ఇచ్చే పప్పుధాన్యం ఇది ఒక్కటే. ఈ కాయలలో పీచు ఎక్కువగా ఉండడం వలన రక్తంలోని చక్కెర మోతాదును తగ్గిస్తుంది. మలబద్ధకం, కాలేయ వ్యాధులకు కూడా ఈ కూర బాగా పనిచేస్తుంది.


వాతావరణం


ఇది ఒక ఉష్ణమండల పంట. అధిక వర్షపాతం, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. మంచును తట్టుకోలేదు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఈ పంట తట్టుకోగలదు. అందుకే వేసవి సాగుకు అనువైన పంట గోరుచిక్కుడు.


నేలలు


సారవంతమైన ఒండ్రునేలలు, ఎర్ర గరప నేలల్లో బాగా పండుతుంది. ఆమ్ల నేలలు దీనికి అనుకూలంకాదు. ఉదజని సూచిక 7.5-8.0 మధ్యలో ఉంటే నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. బరువైన బంక నేలల్లో పెరుగుదల తగ్గుతుంది.


రకాలు


పూసా మాసమి, పూసా సదాబహార్, పూసా నవబహార్, శరద్ బహార్ మొదలగు రకాలను ఎంపిక చేసుకొని నాటుకోవాలి. ఈ రకాలు నాటిన 50-60 రోజుల వ్యవధిలో మొదటి కోతకు వస్తాయి.


నేల తయారీ


నేలను 3-4 సార్లు బాగా కలియదున్నాలి. కలుపు మొక్కలను తీసివేయాలి. చివరి దుక్మిలో 8-10 టన్నుల పశువుల ఎరువు ఎకరానికి వేసి బాగా కలియదున్నాలి.


విత్తన మోతాదు


4-5 కిలోల విత్తనం ఒక ఎకరాకు సరిపోతుంది (కూరగాయల సాగుకోసం), 12-15 కిలోల విత్తనం పచ్చిరొట్ట పైరుకోసం సరిపోతుంది.


విత్తనశుద్ధి


విత్తనం విత్తేముందు 10 గ్రా, రైజోబియం ఒక కిలో విత్తనానికి ఉపయోగించి విత్తనశుద్ధి చేసుకోవాలి. దీని వలన వేరులో నత్రజని సూక్ష్మజీవులను పెంచుతుంది. దీనివలన భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది.


విత్తేదూరం


వీటిని కాలువలు, బోదెల మధ్య పద్ధతుల ద్వారా 45 సెం.మీ. రెండు బోదెల మధ్య, 15 సెం.మీ. రెండు మొక్కల మధ్య నాటుకోవాలి. వేసవిలో చిన్న మళ్ళలో నాటుకోవాలి.


ఎరువులు


ఎకరాకు 8-10 టన్నులు పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. ఎకరాకు 25 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్ను విత్తనం నాటే సమయంలో వేసుకోవాలి. 6 కిలోల నత్రజనిని విత్తనం నాటిన ముప్పై రోజుల సమయంలో వేసుకోవాలి. ఎరువులు వేసిన వెంటనే పంటకు నీరు పెట్టుకోవాలి.


 


నీటియాజమాన్యం


నాటిన వెంటనే సరైన తేమశాతం లేకపోతే ఒక తడి ఇవ్వాలి. రెండవ తడిని నాటిన మూడు రోజుల తరువాత ఇవ్వాలి. మొక్క పూత దశలో, కాయలు ఏర్పడే దశలో తప్పకుండా నీరు కట్టాలి.


కలుపు నివారణ


విత్తనం నాటిన నాటి నుండి ముప్పై రోజుల వరకు పొలంలో కలుపు మొక్కలు చేసుకోవాలి. దీని వలన మొక్కల పెరుగుదలకు అంతరాయం కలిగి పంట దిగుబడి తగ్గుతుంది. దీనికోసం రెండు, మూడు సార్లు చేతితో కలుపు మొక్కలను తీసివేసుకోవాలి. రసాయన కలుపు మందులైన 2,4-డి (1 కిలో) ఒక హెక్టారుకు పిచికారీ చేసుకోవాలి.


పంట కోత


విత్తనం నాటిన 50-60 రోజుల తర్వాత మొదటి కోత వస్తుంది. ఇది 120 రోజుల వరకు కొనసాగుతుంది. లేత కాయలను రెండు మూడు రోజులకొకసారి కోసుకోవాలి. ముదిరిన కాయలకు మార్కెట్ రేటు తగ్గుతుంది. ముదిరిన కాయలలో జీర్ణపోషకాలు తక్కువగా ఉంటాయి. పచ్చిరొట్ట కోసం పంటను పూత దశలో కోసి కలియదున్నాలి.


దిగుబడి


కాయల దిగుబడి ఒక ఎకరాకు 20-26 క్వింటాళ్ళు వస్తుంది. ఎండిన గింజలు అయితే 6-10 క్వింటాళ్ళు ఎకరాకు వస్తాయి.


సస్యరక్షణరసం పీల్చే పురుగులు


దీని నివారణకు మిథైల్ డెమటాన్ లేదా ఫాసలిన్ లేదా ఫిప్రోనిల్ 20 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.


తెగుళ్ళు


బ్యాక్టీరియా తెగులు : ఇది విత్తనం ద్వారా వ్యాప్తిచెందే తెగులు. ఇది ఖరీఫ్ పంట సమయంలో ఎక్కువగా పంటను ఆశిస్తుంది. ఇది మొదటగా చిన్న నీటి మొక్కలుగా ఏర్పడి వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది పెద్ద మచ్చలుగా మారుతాయి. దీని నివారణకు విత్తనాన్ని 0.2 శాతం స్టెప్లోసైక్లిన్ 100 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.


ఆల్టర్నేనియా ఆకుమచ్చ తెగులు : ఆకుపై 2-10 మి.మీ. మచ్చలు గోధుమ రంగులో ఏర్పడతాయి. నివారణకు జినెబ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి నాటిన 15 రోజుల తర్వాత పిచికారీ చేసుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa