కరోనా తాండవిస్తోన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ వస్తువులను విక్రయించే షోరూంల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో కస్టమర్లను ఎలాగైనా ఆకర్షించాలనే ఉద్దేశంతో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కేరళలోని ఓ ఎలక్ట్రానిక్స్ షాప్ ఇలాగే ప్రకటించిన ఓ ఆఫర్ బెడిసికొట్టింది. కరోనా కారణంగా కస్టమర్లు రావడం లేదు కాబట్టి కరోనా భయం లేదనే ఉద్దేశంతో ఆ షోరూం ఆఫర్ ప్రకటించినప్పటికీ అది కాస్తా వివాదాస్పదమైంది. ‘మా దగ్గర షాపింగుకొచ్చిన కస్టమర్లు 24 గంటల్లో కరోనా బారిన పడితే రూ.50 వేలు క్యాష్ బ్యాక్ ఇస్తా’మని ప్రకటించింది. ఆగష్టు 15 నుంచి ఆగష్టు 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేపర్లు, టీవీలు, డిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొట్టాయం జిల్లా పాల మున్సిపాలిటీ కౌన్సిలర్, లాయర్ అయిన బిను పులిక్కక్కందం ఈ ప్రకటన చట్ట వ్యతిరేకం, శిక్షార్హమని భావించాడు. అప్పటికే కరోనా సోకిన వ్యక్తి ఎవరైనా క్యాష్ బ్యాక్ కోసం ఆశపడి తన ఆరోగ్య పరిస్థితిని దాచిపెట్టి ఈ షోరూంకు వెళ్లే ప్రమాదం ఉందంటూ సీఎంకు ఫిర్యాదు చేశాడు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న వారెవరైనా డబ్బు కోసం ఆశపడి కరోనాను కొని తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదని కూడా ఆ లాయర్ హెచ్చరించాడు. దీంతో ఉద్దేశపూర్వకంగా కరోనా వ్యాప్తికి ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నాడు. తన లాభాపేక్ష కోసం ఈ షాపు యజమాని సామాజిక బాధ్యతను మరచిపోయి వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. దీంతో పలానా సెక్షన్ల కింద షాపు యజమానిపై కేసు నమోదు చేయొచ్చని సూచించాడు. షోరూం ప్రకటన వివాదాస్పదం కావడంతో పోలీసులు దుకాణాన్ని మూసేయించారు. కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపడుతున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa