ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాలో విస్తృతంగా పర్యటనలు, తనిఖీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 25, 2017, 01:19 AM

  కాకినాడ, సూర్య ప్రతినిధి : జిల్లా అధికారులు విస్తృతంగా క్షేత్ర పర్యటనలు, తనిఖీలు చేయాలని, క్రింది స్థాయి సిబ్బందిలో స్ఫూర్తిని నింపుతూ ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా కోరారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ విధాన గౌతమి సమావేశ హాలులో జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా జిల్లా అధికారులందరితో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆయా శాఖల పనితీరును సమీక్షించి మరింత మెరుగైన లక్ష్యసాధనకు, వెనుకంజలోఉన్న శాఖలు పనితీరు మార్చుకునేం దుకు మోటివేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు నెలల కాలంలో కలెక్టర్‌గా తన సూచనలు, ఆదేశాలపై వివిధ శాఖల అధికారులు స్పందించిన తీరును విశ్లేషించారు. ఆయాశాఖల స్పందనలు, వాటి నాణ్యత ఆధారంగా వాటికి స్కోర్‌ కార్డులు రూపొందిస్తున్నామన్నారు. ఆయా శాఖలకు శాఖాధిపతులు నిర్ధేశించిన లక్ష్యాలే సిలబస్‌ అని, వాటికి సంబంధిం చిన సమీక్షే జరుపుతున్నామన్నారు. ప్రతిశాఖ మంచి మార్కులతో పాసయ్యేం దుకు శ్రమించాలన్నారు. దీపం గ్యాస్‌ కనెక్షన్ల గ్రౌండింగ్‌ లక్ష్య సాధణలో సివిల్‌ సప్లయ్స్‌, రెవెన్యూ శాఖలు, ఎండిఓలు చేసిన కృషిని అభినందిస్తూ, అదే రీతిలో ప్రతినెల తొలి మూడు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ చేసి రాష్ట్రంలో తొలి రెండు స్థానాల్లో జిల్లాను నిలిపినందుకు డిఆర్‌డిఎ పనితీరును అభినందిస్తూ అదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ఉపాధి హామీ పథకం వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనుల్లో సంతృప్తికరమైన సమన్వయం ఉంటోందని, మెటీరియల్‌ కాంపేనెంట్‌తో అభివృద్ధి పరిచిన ఆస్తుల పట్ల ఆయా శాఖల ఓనర్‌షిప్‌ ధృక్ప థాన్ని పెంపొందించుకోవాలని కోరారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌కు ఇటీవల వరకు రెగ్యులర్‌ పిడి లేకపోవడంవల్ల గృహ నిర్మాణంలో బాగా వెనుకబడిపోయామని, అయితే సమర్ధుడైన పిడి నియామకం జరిగిన తర్వాత, లక్ష్య సాధన దిశగా తపనతో జరుగుతున్న కృషి ఆశావహంగా వుందన్నారు. కాకినాడ జిజిహెచ్‌ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ త్వరలోనే సంస్కరణలు చేపడతా మన్నారు. అటవీ శాఖ కూడా పనితీరు మెరుగుపర్చుకోవాల్సి వుందన్నారు. ఏ అంశమైనా దృష్టికి వచ్చాక అధికారులు గుర్తించడం సరికాదని, తమతమ శాఖా వ్యవస్థల పట్ల అధికారి క్షుణ్ణమైన అవగాహన కలిగి వుండాలన్నారు. ఇందుకు జిల్లా అధికారులు వారంలో కనీసం రెండు నుండి నాలుగు రోజులు క్షేత్ర పర్యటనలు జరపాలని, ఇందులో కనీసం ఒక రోజు ఏజెన్సీ, విలీన మండలాల్లో పర్యటించాలని ఆదేశించారు. అలాగే తమ సబార్డినేట్‌ కార్యాలయాలను తనిఖీ చేసి, సిబ్బందిని చైతన్యపర్చాలన్నారు. కేవలం యాంత్రికంగా పనిచేసుకు పోవద్దని, ప్రతి అంశాన్ని వినూత్నంగా చేసేందుకు ప్రయత్నించాలన్నారు. సమస్యలన్నిటినీ పరిష్కరించ లేకపోయినా, పరిష్కారం కోసం ప్రయత్నం తప్పనిసరిగా చేయాలన్నారు. అలాగే అధికారులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వేకువ జామునే లేచి వ్యాయామం, యోగ చేయాలని, అన్నిటిలో పాజిటివ్‌ యాటిట్యూడ్‌ పెంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎ. సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ 2 జె. రాధాకృష్ణ మూర్తి, డిఎఫ్‌ఓ నందిని సలారియా, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్‌డివోలు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com