భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది. రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి, గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు మహాబల పరాక్రమాలుగల వానరదేహంతో ఆమెకు జనించాడని (శంభుర్జజ్ఞే కపి తనుర్మహాబల పరాక్రమ:) శివమహాపురాణం (శతరుద్ర సమ్హిత 20-7) తెలిపింది. అలా హరాంశతో పుట్టిన హనుమంతుడే రుద్రావతార భగవానుడుగా పురాణ చరిత్ర. అంతేకాదు, హనుమంతుణ్ని శివసుతుడుగా కూడా శ.రు.సం (20-32) వర్ణించింది. తండ్రే తనయుడవుతాడనే (ఆత్మావై పుత్రనామాసి) సూక్తివల్ల, హనుమంతుణ్ని శివనందనుడుగా, శివావతారుడుగా కీర్తిస్తారు. శివుని పదకొండో అవతారమే హనుమంతుడని పరాశర సంహిత ధృవీకరించింది.త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి, రావణసంహారంలో విష్ణు అవతారుడైన శ్రీరాముడికి సహకరించాడని ఈ సంహిత చెబుతోంది. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివవీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడుకి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివవీర్యాన్ని ఒక పండుగా మలచి, పుత్రుడికొసం తప్పస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజని తిన్న ఫలితంగా ఆమె గర్భం దాల్చి, కాలక్రమంలో కుమారుణ్ని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు.వాయుప్రసాది కావడంచేత వాయునందనుడనే పేరు కలిగిందని ఈ సంహిత వివరించింది. భగవదనుగ్రహం వల్లనే పుత్రుడు పుట్టాడు కనుక కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి ధైర్యాన్నిచ్చిందంటారు. దేవలోకంలోని పుంజికస్థల అనే శ్రేష్ఠమైన అప్సరసకాంత బృహస్పతి శాపంవల్ల భూలోకంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మించింది. ఆమే అంజనాదేవి; వానరరాజైన కేసరి భార్య అయింది – వాల్మీకి రామాయణం (కిష్కింధ కాండ 66-8). కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినపుడు, అంజనను వాయువుకు అప్పజెప్పాడు. అంజన అందానికి ఒకసారి వాయుదేవుడు మోహితుడై, ఆమెను కౌగలించుకొన్నాడు. తాను మనస్సు చేతనే ఆమెను అనుభవించాడు కనుక, ఏకపత్నీ వ్రతం భగ్నం కాలేదని ధైర్యం చెప్పి తేజస్వి – బలశాలి – బుద్ధిమంతుడు – పరాక్రమవంతుడు అయిన పుత్రుడు పుడతాడని అంజనిని తృప్తిపరచాడు. సంతసించిన అంజన ఒక గుహలో వైశాఖ బహుళ దశమినాడు బాలుణ్ని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు.ఉదయించే సూర్యుణ్ని చూసిన ఆ బాలుడు దాన్ని తినే పండనుకొని ఆకాశంవైపు 300 యొజనాలు ఎగిరి సూర్యతేజస్సును ఆక్రమించుకొంటున్నాడు. అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుణ్ని కొట్టాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడు హనువు (గడ్డం) విరిగింది. అప్పటినుంచే అతనికి హనుమంతుడనే పేరు వచ్చింది. అలా కేసరికి క్షేత్రజ (భార్యకు ఇతరుల వల్ల పుట్టిన) పుత్రుడుగాను, వాయువుకు ఔరస (చట్ట బద్ధమైన) పుత్రుడుగాను, శివవీర్యం వల్ల పుట్టినందుచేత శంకరసువనుడుగాను లోకప్రసిద్దమైన పేర్లు హనుమంతుడి జన్మ రహస్యాల్లోని పవిత్రతను వెల్లడిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa