యూపీలో వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌తో మరోసారి గ్యాంగ్ స్టర్ల అంశం తెరపైకి వచ్చింది. చీకటి నేర సామ్రాజ్యానికి రారాజులైన నేరగాళ్లు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. ముఖ్యంగా నయీం, మద్దెల చెరువు సూరి, పటోళ్ల గోవర్థన్ రెడ్డిలు తమ గ్యాంగ్‌లతో హల్ చల్ చేశారు. వీరిలో ఎవరు ఇప్పుడు ప్రాణాలతో లేరు. నయీం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోగా, మద్దెల సూరిని తన అనుచరుడే చంపేశాడు. ఇక పటోళ్ల గోవర్థన్ రెడ్డిని ప్రత్యర్థులే దారుణంగా చంపేశారు.వీరి ముగ్గురు ఒకప్పుడు నేర సామ్రాజ్యాన్ని స్థాపించి ఏలారు. అనంతపురంలో జిల్లాలో పరిటాల, మద్దెలచెరువు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు సాగేది. క్రమక్రమంగా మద్దెలచెరువు సూరి రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడుగా ఎదిగాడు. అడ్డొచ్చిన వాళ్లను చంపుకుంటూ తన నేర సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడు. కొన్ని కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆఖరికి టీడీపీ రాజకీయ నేతగా ఎదిగిన పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. సూరి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే 2005 జనవరి 25వ తేదీన పెనుకొండ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్యకు గురయ్యారు. సూరి బావ కళ్లలో ఆనందం చూసేందుకే తాను ఈ హత్య చేశానని జూలకంటి రంగారెడ్డి అలియాస్ మొద్దుశీను ప్రకటించాడు. అయితే సూరిని తన అనుచరుడైన భానుకిరణ్‌నే హత్య చేశాడు.తెలంగాణలో మరో గ్యాంగ్ స్టర్ పటోళ్ల గోవర్థన్ రెడ్డి. కరుడుగట్టిన నేరస్థుడని చెప్పుకోవచ్చు. పటోళ్ల గోవర్ధన్ రెడ్డిది రంగారెడ్డి జిల్లా తాండూరు. గోవర్థన్ రెడ్డి పార్శిల్ బాంబులు పంపి వ్యాపారులను బెదిరించేవాడు. చాలాచోట్ల గాంధీ విగ్రహాలను ధ్వంసం చేసేవాడు. దేశభక్త పులులు సంస్థ పేరు మీద అతను మొదట్లో పత్రికలకు ప్రకటనలు పంపుతూ ఉండేవాడు. అలా అతను ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లలో, భూవివాదాల్లో తలదూర్చేవాడు. పరిటాల రవి హత్య కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు.2011లో హైదరాబాద్‌లో హత్యకు గురయ్యాడు. వ్యూహం ప్రకారమే గోవర్థన్ రెడ్డి అనుచరులను ఉపయోగించుకుని ప్రత్యర్థులు అతని ప్రాణాలు తీశారనే అనుమానాలున్నాయి.ఇక నయీం అంటే తెలియని వారుండరు. నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం కరుడుగట్టిన నేరస్థుడు. నయీంకు గ్యాంగ్‌స్టర్‌గా రెండు దశాబ్దాలకుపైగా నేర చరిత్ర ఉంది. నయీం40కి పైగా హత్యలు చేయించాడు. అతికొద్ది కాలంలోనే బెదిరింపులు, లెక్కలేనన్ని సెటిల్‌మెంట్లు తన ఖాతాలో వేసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. నయీం చేసిన అనేక దారుణ హత్యల్ని ఇప్పటికీ పోలీసులే మర్చిపోలేరు. నయీం పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. 2016లో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ లోని మిలీనియం టౌన్‌షిప్‍లో తలదాచుకున్న నయీంను పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమార్చారు.ఇలా తెలుగు రాష్ట్రాల దావూద్‌ల్‌గా మారి.. తెలుగు రాష్ట్రాల్లో తమకంటూ చీకటి పేజీని రచించుకున్నఈ గ్యాంగ్ స్టర్లు ప్రజలను భయపెట్టడమే కాదు. నిట్టనిలువునా ప్రాణాలు తీశారు. అడ్డదారిలో లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించారు. చివరి తాము నమ్ముకున్న ఆయుధానికే వారు బలి అయ్యారు. ఇప్పటికీ వీరు కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయి. వారి అనుచరులు ఇప్పుడు అడపాదడపా హల్‌చల్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa