కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో దేశంలో ఉన్న జూ పార్క్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్, తిరుపతిలోని ఎస్వీ జూ పార్క్ సిబ్బంది జంతువుల సంరక్షణలో అప్రమత్తమయ్యారు. జూ పార్క్ లల్లో జంతువులను ఉంచే ఎన్‌క్లోజర్లు, రాత్రి పూట ఉంచే ప్రాంతాలను శానిటైజ్ చేయడంతోపాటు సిబ్బందికి కూడా శానిటైజర్లు, మాస్కులు అందిస్తున్నారు. నిత్యం భౌతిక దూరం పాటించాలన్న సూచనలు అందిస్తున్నారు. ఇప్పటి వరకూ మన దేశంలో మనుషుల నుంచి జంతువులకు కరోనా వ్యాప్తి చెందిన దాఖలాలు లేనప్పటికీ జూపార్క్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు ప్రారంభించారు. కరోనాతో బాధపడే వారితో జంతువులకు కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందని తెలియడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.నెహ్రూ జూపార్క్‌లో జంతువులు, పక్షులు, సరీసృపాలు అన్నీ కలిపి దాదాపు 1700 ప్రాణులు ఉన్నాయి. వీటిని ఎన్‌క్లోజర్‌లతో ఉంచుతారు. కొన్ని జంతువులను రాత్రి సమయంలో నిద్రించేందుకు వేరే స్థానానికి చేర్చుతారు. జూపార్క్ సిబ్బంది రాత్రిబస ప్రాంతాలను 4 సార్లు శానిటైజ్ చేశారు. జంతువులు ఉండే ఎన్‌క్లోజర్లు, రాత్రిబస ప్రాంతాల్లో యాంటివైరల్ ద్రావణం (వైరాసిడ్ 1 లీటర్ నీటిలో 10 గ్రాములు కలిపి) పిచికారీ చేశారు. క్రిములను నాశనం చేసేందుకు సున్నం, బ్లీచింగ్ పౌడర్‌లు జంతువులు సంచరించే ప్రాంతాల్లో చల్లారు. జూపార్క్ గోడల నుంచి మొదలు కొని సిబ్బంది క్వార్టర్స్‌తోపాటు జూపార్క్ మొత్తం సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేశారు.జూపార్క్‌లో ఉన్న జంతువుల ఆరోగ్య పరిస్థితిని వెటర్నరీ వైద్యులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. జంతువులకు సరైన పోషకాలున్న ఆహారంతోపాటు పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నారు. ముఖ్యంగా పులులు, క్షీరదాల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఏవైనా జంతువులు దగ్గు, జలుబుతో బాధపడుతున్నాయా అనే విషయాన్ని నిత్యం గమనిస్తున్నారు. పరిసరాల్లో బ్లీచ్, సోడియం హైపోక్లోరైడ్ వంటి ద్రావణాలు చల్లి వైరస్ వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్‌క్లోజర్లు శుభ్రపరిచే సిబ్బంది, ఆహారం అందించే సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో ప్రత్యేకంగా గమనిస్తున్నారు. జంతువులకు ఇచ్చే ఆహారాన్ని తనిఖీ చేస్తున్నారు. కరోనా సోకిన లేదా అనుమానితులైన మనుషులు స్వతహాగా క్వారంటైన్‌లోకి వెళ్లి ఇతరులతో కలవకుండా ఉండొచ్చు. కానీ జంతువులను క్వారంటైన్ చేయడం, వాటిని ఏకాంతంగా ఉంచి చికిత్స అందించడం కొంతవరకూ కష్టమైన పనే అని జూ అధికారులు తెలిపారు.విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని నిత్యం తనిఖీలు చేయడం, వారు రక్షణ చర్యలైన మాస్క్‌లు, గ్లవ్ ధరిస్తున్నారోలేదో గమనిస్తున్నామని నెహ్రూ జూపార్క్ క్యూరేటర్ ఎన్.క్షితిజ, ఎస్వీ జూ పార్క్ క్యూరేటర్ హిమజ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బయటి ఆహారం లేకుండా సిబ్బందికి భోజనం జూపార్క్‌లోనే సిద్ధం చేస్తున్నామన్నారు. వైరస్ లు వ్యాప్తి చెందకుండా జూపార్క్ మొత్తం యాంటీ వైరల్ ద్రావణం, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాలు పిచికారీ చేశారని, జంతువులు సంచరించే ప్రాంతాల్లో సున్నం, బ్లీచ్ చల్లడం ద్వారా ఎలాంటి వైర్‌సలు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వెటర్నరీ సిబ్బంది ఎప్పటికప్పుడు జంతువుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారని, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సిబ్బందిని ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ పర్యవేక్షిస్తున్నామని క్యూరేటర్లు తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa