రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ పార్లమెంటరీ సమావేశం

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 12:38 PM
 

న్యూఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం జరుపుతుంది. ఢిల్లీలో సమావేశమైన పార్లమెంటరీ పార్టీ బోర్డు రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రానికి రాష్ట్రపతి అభ్యర్థి పేరును బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. విపక్షాలు, మిత్రపక్షాలతో చర్చించిన వివరాలను త్రిసభ్య కమిటీ పార్లమెంటరీ పార్టీ బోర్డుకు నివేదించనుంది. అయితే రాజకీయ అవగాహన ఉండి, రాజ్యాంగంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తిని రాష్ర్టపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తే తమకు అభ్యంతరం లేదని విపక్షాలు త్రిసభ్య కమిటీకి సూచించినట్లు సమాచారం. అధికార పార్టీ రాష్ర్టపతి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత విపక్షాలు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, త్రిసభ్య కమిటీ సభ్యులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయితే ఎల్‌కే అద్వాణీ లేదా జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము పేర్లను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.