పరుగుల రాణి పీటీ ఉష పేరు తెలియని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. భారతీయ కీర్తి కిరీటాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేసిన ఆమె జీవితం పూలపాన్పు కాదు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో పరుగుని జీవిత ఆశయంగా ఎంచుకొని ఒలింపిక్, ప్రపంచ పోటీలలో పాల్గొని సత్తా చాటింది. ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శం. భారత దేశపు క్రీడారంగంలో పి.టి.ఉష పరుగుల రాణిగా పేరు పొందింది. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీలో 1964 జూన్ 27న ఉష జన్మించింది. పీటీ ఉష అసలు పేరు పిలావుళ్లకండి తేక్కిపరాంబిల్ ఉష.1979 నుంచి, భారతదేశం తరపున అథ్లెటిక్స్ లో పాల్గొని, దేశానికి పలు విజయాలను అందించింది. ఈమెను పయోలి ఎక్స్ ప్రెస్ అని పిలుస్తారు. పి.టి.ఉష 1976లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన క్రీడా పాఠశాలలో కోజికోడ్ జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించి, అందులో చేరింది. 1979లో ఉష జాతీయ స్థాయి పాఠశాల క్రీడలలో పాల్గొంది. అప్పుడే ఆమెలోని నైపుణ్యాన్ని కోచ్ ఓ.నంబియార్ తెలుసుకున్నారు. అప్పటి నుంచి ఆమెకు చాలా కాలం వరకు కోచ్ గా శిక్షణ ఇచ్చాడు.ఆ సమయంలో దేశంలో మహిళా అథ్లెట్ల సంఖ్య చాలా తక్కువ. అథ్లెటిక్ సూట్ ధరించి ట్రాక్ పై పరుగెత్తడం అరుదుగా జరిగేది. 1980 రష్యా ఒలింపిక్స్ లో పాల్గొన్నా కూడా ఆమెకు అది అంతగా కలిసిరాలేదు. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో 100 మీటర్లు మరియు 200 మీటర్ల పరుగులో రజత పతకం సాధించింది. 1985లో కువైట్లో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో ఉష బంగారు పతకం పొందడమే కాకుండా, కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 1983 నుంచి 1989 మధ్యకాలంలో ఉష ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్స్ పోటీలలో 13 స్వర్ణ పతకాలను సాధించింది. 1984లో అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో ఉష సెమీఫైనల్స్ లో పథమస్థానంలో వచ్చినా కూడా పైనల్స్ లో వెంట్రుకవాసిలో పతకం పొందే అవకాశం పోగొట్టుకుంది.సెకనులో వందోవంతు తేడాతో కాంస్యపతకం పొందే అవకాశం జారవిడుచుకున్నా కూడా ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్స్ లో పైనల్స్ చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 1986లో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగిన 10వ ఆసియా క్రీడలలో పి.టి.ఉష 4 బంగారు పతకాలను సాధించడమే కాకుండా అన్నిట్లోనూ ఆసియా రికార్డులు సాధించడం విశేషం. అదే ఆసియాడ్ లో మరో రజత పతకం కూడా సాధించింది. 1985లో జకార్తాలో జరిగిన 6వ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్ పోటీలలో ఈమె 5 బంగారు పతకాలను సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అంతర్జాతీయ క్రీడాజీవితంలో పీ.టీ.ఉష 101 స్వర్ణ పతకాలను సాధించింది.1984లో భారత ప్రభుత్వం పీటీ.ఉషకు పద్మశ్రీ తో సత్కరించింది. 1985 లో జకర్తా అథ్లెటిక్ మీట్ లో గొప్ప మహిళా అథ్లెట్ గా పేరుపొందింది. 1984, 1985, 1986, 1987 మరియు 1989 లలో ఆసియా అవార్డులో అత్తమ అథ్లెట్ గా అవార్డు అందుకుంది. 1984, 1985, 1989 మరియు 1990 లలో ఉత్తమ రైల్వే క్రీడాకారులకు ఇచ్చే మార్షల్ టిటో అవార్డు దక్కించుకుంది. 1986 లో సియోల్ ఆసియా క్రీడలలో ఉత్తమ అథ్లెట్ కు ప్రధానం చేసే అడిడాస్ గోల్డెన్ షూ అవార్డు సంపాదించింది. అథ్లెటిక్స్ లో ఉత్తమ ప్రదర్శనకు 30 అంతర్జాతీయ అవార్డులు, 1999 కేరళ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అవార్డు కైవసం చేసుకుంది. 1985, 1986 లలో ఉత్తమ అథ్లెటకు ఇచ్చే వరల్డ్ ట్రోఫీ అవార్డు కూడా ఉషకే ప్రదానం చేసారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa