ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిగంబరోజ్వలిత ధిక్కారకవి.. మహాస్వప్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 26, 2020, 02:05 PM

తెలుగు ఆధునిక కవిత్వంలో దిగంబర కవిత్వం చూపిన ప్రభావం, ఇచ్చిన ప్రేరణ, కలిగించిన సంచలనం మరిచిపోలేనిది. దిగంబర కవిత్వం ఆరుగురితో ఉద్యమ కవిత్వంలా విస్తరించి తన ఉనికిని చాటుకొంది. దిగంబర కవితోద్యమంలో తీవ్ర సంచలనం రేపిన ప్రముఖ దిగంబర కవి మహాస్వప్న జన్మస్థలం ప్రకాశం జిల్లా లింగసముద్రం. ఈయన అసలు పేరు కమ్మిశెట్టి వెంటేశ్వరరావు. 1958లో నార్ల చిరంజీవి సహకారంతో ‘‘చందమామ’’ పేరుతో బాల కవితా సంకలనం వెలువరించారు. అప్పటికి ఆయన వయస్సు పద్దెనిమిదేండ్లు. 1964లో ‘‘అగ్నిశిఖలు- మంచు జడులు’’, ‘‘స్వర్ణ్ధూళి’’, కవితా సంకలనాలతో తన స్థానాన్ని కవితా ప్రపంచంలో సుస్థిరం చేసుకున్న కమ్మిశెట్టి 1965లో అనూహ్య పరిస్థితుల్లో మహాస్వప్నగా విజృంభించి విశృంఖలంగా రచనలు సాగించారు. ఆయన కవితలు ఆరని అగ్నికణాలు. ‘‘మానసిక దిగంబరత్వంకోసం నిత్య సచేతన ఆత్మస్ఫూర్తితో జీవించడమే మా ఆశయం. శ్వాసించే ప్రతి వ్యక్తితో సారూప్యం చెంది, వ్యక్తి అస్తిత్వ పరిరక్షణకోసం, అంతరంగంలో అణగిపడివున్న ఆరాటాన్ని, ఆ సంతోషాన్ని, విసుగును, అక్షరాల్లో వ్యక్తీకరించి నూతన విశ్వాసాన్ని, ఆశను కలిగించాలని మా తత్పరత.’’ - అంటూ నగ్నముని ప్రకటించారు.నిర్లిప్తత ఆవరించిన పరిస్థితులు, సామాజిక, రాజకీయ స్థితిగతులు నానాటికీ దిగజారిపోతూ పతనావస్థకు చేరుకున్న దశలో దిగంబరులు గొంతువిప్పారు. సమాజంలో కులతత్వం, మత ప్రాబల్యం అధికమవుతూ అవినీతి, బంధుప్రీతి, మనిషి స్వప్రయోజనం తప్ప సమిష్టి ప్రయోజనాలవైపు దృష్టిసారించే చైతన్యం కోల్పోయి ఉన్న స్థితిలో దిగంబరులు ముందుకొచ్చారు. వీటికితోడు యువతరాన్ని భ్రష్టుపట్టించే సాహిత్యం, మానసికంగా ఎదగనీయని సినిమాలు, పత్రికలు, రాజకీయాలు, సాహిత్య సంస్థలు, విశ్వవిద్యాలయాలు అన్నీ వేటికవే కలుషితమయ్యాయి. సమాజమంతా గమ్యరహితంగా నడవసాగిన సమయంలో దీనినుండి బయటపడే మార్గంకోసం కవుల వెతుకులాట సాగింది. తత్ఫలితమే దిగంబర కవిత్వం. సమాజ, సాహిత్య రంగాలలో పేరుకుపోయిన నైచ్యాన్ని తొలగించే ప్రయత్నం దిగంబరులు చేశారు.మహాస్వప్న అధునాతన అభివ్యక్తితో బరువైన భావనాబలంతో కవిత్వం వినిపించిన మానవతా కవి. సామాజిక సాహిత్యరంగాల్లో ఏర్పడ్డ స్తబ్దతను బద్దలుకొట్టి కవిత్వం రాసి దిగంబర కవితోద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించిన అక్షరశిల్పి మహాస్వప్న. నిజాలను మరువని, ఏ భేషజాలకు లొంగని నిజాయితీ మనస్తత్వం, నిర్మల వ్యక్తిత్వం, నిఖార్సైన కవిత్వం ఆయనది. మహాస్వప్న రచనలు సూటిగా, ఘాటుగా ఉంటూ పాఠకుల్ని లోతుగా ఆలోచింపజేస్తాయి. అంతటి ఘనతవహించిన ఆయన 2019 జూన్ 25న లింగసముద్రంలోని తన గృహంలో మరణించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa