ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్మకాయల దీపం పెట్టటం వలన కలిగే ఫలితాలు, పాటించాల్సిన నియమాలు...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 25, 2020, 01:56 PM

“నిమ్మకాయ దీపం” అనేది కుజదోషం, కాలసర్ప దోషం, వ్యాపార, కుటుంబ, ఆర్ధిక భాదలతో సతమతం అయ్యే వారికి చక్కని తరుణోపాయం అని చెప్తారు పండితులు. మరి ఈ నిమ్మకాయ దీపాలు పెట్టటం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చు, ఈ దీపాలు పెట్టేటపుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేది మనం ఇపుడు తెల్సుకుందాం..నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపమైన అమ్మవారు అనుగ్రహించి, ఈతి బాధలను తొలగిస్తుంది అంటారు. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతి దేవికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన దండను పార్వతి దేవికి, గ్రామ దేవతలైన మైసమ్మ , ఎల్లమ్మ , పోచమ్మ , మారెమ్మ, పెద్దమ్మ మొదలైన శక్తి రూప దేవి అవతారాలకు మాత్రమే వేస్తారు. ఈ నిమ్మకాయల దీపం గ్రామ దేవతల ఆలయాలలో వెలిగించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి , సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు .పార్వతి దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను వెలిగించదలిస్తే దేవి వారాలుగా పరిగిణించే మంగళ, శుక్రవారాల్లో రాహుకాల సమయాలలో మాత్రమే వెలిగించాలి.. మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే,మంగళ వారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది. శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది. శుక్రవారం రోజు దేవికి వెలిగించే నిమ్మకాయ దీపం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది.శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి, పెరుగు అన్నం, పెసరపప్పు, పానకం లేక మజ్జిగ ఇవి కాకపొతే కనీసం పండ్లయినా నైవేద్యము పెట్టి తరువాత సుమంగళికి ఇవ్వాలి. కుదిరితే పసుపు , కుంకుమ , పూలు , గాజులు, జాకెట్టు ముక్క, చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం. తాంబూలం దానం అలాగే వారి వారి శక్తికి తగినట్లుగా దక్షిణ ఇచ్చి సుమంగళికి నమస్కారం చేయాలి. ఇలా చేస్తే తలచిన కార్యాలు ఎటువంటి ఆటకం లేకుండా శుభప్రదంగా త్వరగా నెరవేరతాయి. అయితే ఈ నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు కొన్ని అంశాలు గమనించుకోవాలి. మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను, ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటినే ఉపయోగించాలి. అలాగే ఇంట్లో పండుగ సమయం పెద్దల తిధి కార్యాలు ఉన్న రోజున, మైల సమయాల్లోనూ నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. పిల్లల పుట్టిన రోజునాడు, పెళ్లి రోజున గాని నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు. అలాగే వేరే ఊరు వెళ్లినప్పుడు మిత్రుల, బంధుల ఇంట్లో నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. అక్కచెల్లెళ్ళ ఇంటికి లేదా పుట్టింటికి వెళ్లినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు.స్త్రీలు పార్వతి దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి వేడుకుంటే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అనుకున్న అన్నీకార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి. ఈ సమయంలో ఎరుపు, పసుపు రంగు వస్త్రాలు వాడితే మరి మంచిది. నిమ్మకాయ దీపం నేల మీద పెట్టకూడదు. దీపం క్రింద తమలపాకు గాని ఏవైనా ధాన్యపుగింజలను కానీ వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత ధూపం తప్పక వేయాలి. నిమ్మకాయ దీపాల పూజకు ఎర్రని పూలనే ఉపయోగించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa